''ఈ ప్రపంచంలో ఆంటీని ఆంటీ అంటే ఫీల్ అవ్వని ఆంటీ అసలు ఆంటీయే కాదు'' - 'జబర్దస్త్' కార్యక్రమంలో, ఒక స్కిట్‌లో 'హైపర్' ఆది వేసిన డైలాగ్. అతడు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో కానీ... ఆంటీ అంటే చాలా మంది కోపం వస్తుందని ఆ తర్వాత తెలిసింది. ఆ స్కిట్ చూసి ఎంజాయ్ చేసిన యాంకర్, ఆర్టిస్ట్ అనసూయ కూడా ఆ తర్వాత తనను ఆంటీ అని కామెంట్ చేసే వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్ కోర్స్... స్కిట్ వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనుకోండి! ఆంటీ అని పిలిస్తే అసలు ఇష్టపడని మరో వ్యక్తి నటి ప్రగతి (Pragathi Mahavadi On Aunty Comments).
ప్రగతి (Pragathi Mahavadi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యువతరానికి కూడా ఆమె తెలుసు. చాలా సినిమాల్లో అమ్మ, అత్త పాత్రల్లో కనిపిస్తారు. లేటెస్టుగా ఒక టీవీ ఛానల్‌కు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ''మిమ్మల్ని కూడా ఎవరైనా ఆంటీ అని పిలిస్తే కోపం అంట కదా!'' అని అడిగితే... ''అలా పిలవొద్దు'' అన్నట్లు వేలు చూపించారు. ఆంటీగా కనిపించకూడదని వర్కవుట్స్ చేస్తారా? అంటే... జిమ్ లో వర్కవుట్స్ చేయడం వల్ల అందం పెరగదని, తన బలం & కాన్ఫిడెన్స్ పెరుగుతుందని తెలిపారు.
ఇప్పుడు అయితే అమ్మ, అత్త పాత్రల్లో ప్రగతి నటిస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆమె కథానాయికగా సినిమాలు చేశారు. అయితే, మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు లెండి. అందుకు కారణం తాను మాట్లాడిన మాటలేనని ప్రగతి తెలిపారు. ''రజనీకాంత్, కమల్ హాసన్ అయితే చేస్తాను. వీడి పక్కన చేయనని చెప్పాను. దాని వల్ల (హీరోలు) బాగా హర్ట్ అయ్యారు'' అని ఆవిడ తెలిపారు. అందుకే, అవకాశాలు రాలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఒకసారి తిండి విషయంలో ఒకరు చేసిన కామెంట్స్ వల్ల బాధపడ్డానని ఆవిడ తెలిపారు.
కటౌట్ కొంచెం పెద్దది కాబట్టి ఇండస్ట్రీలో తనను చూసి కొంచెం భయపడతారని ప్రగతి తెలిపారు. పొట్ట తిప్పల కోసం అలా నెట్టుకు వస్తున్నానని ఆవిడ సున్నితంగా సెలవిచ్చారు. 'ఇండస్ట్రీలో మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటారట! నిజమేనా?' అని ప్రగతిని అడిగితే... 'ఐ డోంట్ నో' అని సమాధానం ఇచ్చారు. తనది ఇన్స్టంట్ రియాక్షన్ అన్నారు.
Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్
ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా తన అవకాశాలకు ఏ ఢోకా లేదని, ఎందుకంటే తాను అందగత్తెనని ప్రగతి తెలిపారు. కుడి చేతిపై ఉన్న మచ్చను కవర్ చేయడం కోసం టాటూ వేయించుకున్నానని ఆమె తెలియజేశారు. ఆ తర్వాత దానిని చూసి టాటూ బావుందని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చినట్లు ప్రగతి తెలిపారు. తన మీద ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని క్లారిటీ ఇచ్చారు. ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరిగినంత మాత్రాన ఏనుగు నడక ఆగిపోదని విమర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను బిఏ పొలిటికల్ సైన్స్ చదివానని, అయితే రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు.