విష్ణు మంచు (Vishnu Manchu) 'జిన్నా' చిత్రంపై అమెరికాలో తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. ఆ ప్రభావం వసూళ్లపై పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు పదిహేను మంది టికెట్లు కొంటే, రాత్రికి ఆ సినిమా చూసిన వారి సంఖ్య సుమారు యాభైకి చేరుకుందని సమాచారం. మొదటి రోజు అమెరికాలో 'జిన్నా' 493 డాలర్లు కలెక్ట్ చేసిందట. ఇండియన్ కరెన్సీలో అయితే 40 వేల రూపాయలు. 17 లొకేషన్లలో 50కు పైగా షోలు వేస్తే అన్నిచోట్లా కలిపి 50 మంది కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అమెరికాతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బెటర్. 


తెలుగునాట అమెరికా కంటే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ షోస్ కౌంట్ చూస్తే ఆ కలెక్షన్స్ కూడా తక్కువే అంటున్నారు. సినిమాపై సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. స్క్రీన్ మీద విష్ణు మంచు 'డైనమిక్ స్టార్' అని వేసుకోవడంపై ట్రోల్స్ వస్తున్నాయి. థియేటర్ దగ్గర పెట్టిన కటౌట్ మీద కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బుక్ మై షో, పేటీఎం యాప్స్ ఓపెన్ చేస్తే హైదరాబాద్ సిటీలో థియేటర్స్, మల్టీప్లెక్స్ స్క్రీన్లు కూడా ఖాళీగా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు. 


'జిన్నా' థియేటర్లు ఖాళీగా ఉండటంతో ఓయో రూమ్స్ బుక్ చేసుకోవడం మానేసి, కొన్ని జంటలు 'జిన్నా' థియేటర్లకు వెళుతున్నారనే పోస్టులు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. ఓయో రూమ్స్ వ్యాపారాన్ని విష్ణు మంచు నాశనం చేస్తున్నారని ఒకరు ట్వీట్ చేశారు. తనపై కొందరు కావాలని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని,  జూబ్లీ హిల్స్‌లో ఓ ప్రముఖ నటుడి ఆఫీస్, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి ఎక్కువ మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాని విష్ణు మంచు ఆ మధ్య మాట్లాడారు. ట్రోల్స్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయినా సరే ట్రోల్స్ ఆగడం లేదు.


Also Read : బాలకృష్ణ సినిమా చూసి రోజంతా జైల్లో ఉన్న దర్శకుడు


గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ట్రోల్స్, జోక్స్‌ను యథావిధిగా ఇక్కడ అందించాం. అందులో వ్యక్తులు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. ఒక్కసారి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చూస్తే... 






















































కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. మోహన్ బాబు ఆశీసులతో... ఆయన నిర్మాణంలో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై 'జిన్నా' సినిమా రూపొందింది. దీనికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రానికి అసలు కథ... దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి అందిస్తే, కోన వెంకట్ స్క్రిప్ట్ రాశారు. మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందించారు. 'జిన్నా' టైటిల్ కార్డ్స్‌లో ''స్క్రీన్ ప్లే, నిర్మాత - మోహన్ బాబు'' అని వేశారు. అదీ సంగతి!  


స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటించిన ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సీనియర్ నరేష్, సునీల్, 'వెన్నెల' కిశోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమాతో తన కుమార్తెలు అరియానా - వివియానాను సింగర్స్‌గా పరిచయం చేశారు విష్ణు మంచు. కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.