పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'భీమ్లానాయక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా వంద కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పవన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ముందుగా క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాను పూర్తి చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు.
అలానే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సుజీత్ లాంటి దర్శకులతో కలిసి పని చేయబోతున్నారు. వీటిలో హరీష్ శంకర్ తో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
గతంలో హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమాలో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ గానే కనిపించారు. ఇప్పుడు మరోసారి హరీష్ శంకర్.. పవన్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారని ఆశించారు అభిమానులు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పవన్ లెక్చరర్ గా కనిపించబోతున్నారట.
ఇప్పటికే టాలీవుడ్ లో విద్యావ్యవస్థ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఒకట్రెండు సినిమాలను ఇదే కాన్సెప్ట్ తో మొదలుపెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా ఇలాంటి నేపథ్యాన్నే ఎన్నుకున్నారు. మరి దీనిపై దర్శకనిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!