Best Horror Movies On OTT: చనిపోయిన వారిని తిరిగి తీసుకురావాలని, ఆత్మలను బంధించాలని చాలామంది ప్రయత్నాలు చేయడం, దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం.. ఇలాంటి కథ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. దాదాపు ఇదే కథతో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ సినిమా ‘ది బ్రైడ్’ (The Bride). చనిపోయిన తన భార్యను తిరిగి బ్రతికించుకోవాలి అనుకునే ఒక ఫోటోగ్రాఫర్ ప్రయత్నం.. ఎన్నో ఏళ్ల పాటు తన వంశాన్ని శాపంలా వెంటాడుతుంది. చివరికి తన వంశం.. ఆ శాపం నుంచి ఎలా తప్పించుకుంది?


కథ..


‘ది బ్రైడ్’ కథ విషయానికొస్తే.. సినిమా మొదలవ్వగానే 1800ల్లో తన కెమెరాతో ఒక హారర్ ప్రయోగం చేయడానికి సిద్ధమవుతాడు ఓ ఫోటోగ్రాఫర్. ఆ కెమెరా ద్వారా చనిపోయిన వ్యక్తిని ఫోటో తీసి.. వారి ఆత్మను బ్రతికున్న మనిషిలోకి పంపే ప్రయోగాన్ని చేస్తుంటాడు ఆ వ్యక్తి. పెళ్లయిన కొన్నిరోజులకే తన భార్యను కోల్పోవడంతో ఆ కెమెరా ద్వారా తన భార్య ఆత్మను వేరొకరి శరీరంలోకి పంపాలనుకుంటాడు. అందుకే ఆమె శవాన్ని పూడ్చిపెట్టకుండా పెళ్లికూతురులా డ్రెస్ వేసి.. ఆమెకు ఫోటో తీస్తాడు. ఆ ఫోటోను ఎవరికీ తెలియని ఒక ప్లేస్‌లో దాచిపెడతాడు. ఆ తర్వాత ఒక యువతిని తీసుకొచ్చి తన భార్య రింగ్‌ను ఆ యువతికి తొడిగి ఆత్మను ఆ యువతిలోకి వెళ్లేలా చేస్తాడు. తన భార్య ఆత్మ యువతిలోకి వెళ్లడంతో తననే భార్యలాగా భావిస్తూ ఆమెతో కలిసుంటాడు. కానీ తను అనుకున్నట్టు.. అది తన భార్య ఆత్మ కాదు. ఏదో చెడ్డ ఆత్మ.. ఆ యువతి శరీరంలోకి ప్రవేశించి ఫోటోగ్రాఫర్ ఫ్యామిలీని ఏం చేయకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు తనకు ఒక వర్జిన్ యువతిని బలి ఇవ్వాలని చెప్తుంది.


కట్ చేస్తే.. 2017లో నాస్త్య (విక్టోరియా అగలకోవా), ఇవాన్ (వ్యాచెస్లేవ్ చెపుర్చెంకో)కు కొత్తగా పెళ్లి అవుతుంది. ఇవాన్.. నాస్త్యను తన వంశ పారంపర్యంగా వస్తున్న ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పటికీ అక్కడ ఇవాన్ చెల్లెలు లీసా (అలెక్సాండ్రా రెబెనాక్).. తన పిల్లలతో కలిసుంటుంది. ఆ ఇల్లు మరెవరిదో కాదు 1800ల్లో మనకు చూపించిన ఫోటోగ్రాఫర్ ఇల్లే. దీంతో ఇవాన్ కూడా ఆ ఫోటోగ్రాఫర్ వంశానికి చెందినవాడే అని అర్థమవుతుంది. ఆ ఇంట్లో ఉండిపోయిన ఆత్మకు నాస్త్యను బలి ఇవ్వడానికి లిసా ప్లాన్ చేస్తుంది. పెళ్లి తర్వాత నాస్త్యను అక్కడికి తీసుకురమ్మని ఇవాన్‌కు చెప్తుంది. అదంతా తెలిసిన తర్వాత ఇవాన్.. తన భార్యను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అతడిని కూడా కుటుంబ సభ్యులు బంధించేస్తారు. చివరికి ఇవాన్.. నాస్త్యను కాపాడుకోగలడా? ఆ ఆత్మ ఆ ఇంటిని వదిలి వెళ్లడానికి వాళ్లు ఏం చేస్తారు? అనేది తెరపై చూడాల్సిన కథ.



 


చాలావరకు సైకలాజికల్ హారర్ సినిమాల్లాగానే ‘ది బ్రైడ్’ను కూడా తెరకెక్కించాడు దర్శకుడు స్వ్యాతోస్లవ్ పొడ్గాయెవ్‌స్కీ. హీరోయిన్‌గా నటించిన విక్టోరియా.. తనను చంపేస్తారు అని గ్రహించగానే కనబరిచిన నటన మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ‘ది బ్రైడ్’లో అన్నింటికంటే పెద్ద పాజిటివ్ విషయం ఏంటంటే కథ. కథను పూర్తిస్థాయి హారర్‌గా కాకుండా కాస్త సైకలాజికల్‌గా మార్చడంతో ప్రేక్షకులు దీనిని ఆసక్తిగా చూడగలిగారు. 2017లో విడులదయిన ఈ మూవీ చాలామంది హారర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంది. హారర్‌తో పాటు సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారు యాపిల్ టీవీలో ఉన్న ‘ది బ్రైడ్’ను ట్రై చేయవచ్చు.



Also Read: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు