సబ్రీనా.. 2018లో విడుదలయిన ఇండోనేషియన్ హార్రర్ ఫిల్మ్ ఇది. ఒక దెయ్యం ఆత్మ బొమ్మలోకి ఎలా ప్రవేశించింది? తర్వాత ఏం చేసింది? అన్నదే కథ.
ఇదీ కథ:
వాన్యా తల్లిదండ్రులు చనిపోతారు. ఇష్టం లేకపోయినా ఆమెను తన ఆంటీ, అంకుల్ మార్యా, ఈడెన్ లు దత్తత తీసుకుంటారు. దీంతో ఆమె వారితోనే కలిసి ఉంటుంది. మార్యా, ఈడెన్.. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాన్యా మాత్రం తన తల్లిని మిస్ అవుతున్న బాధలోనే ఎప్పుడూ ఉంటుంది. ఈడెన్‌కు ఒక బొమ్మలు తయారుచేసే ఫ్యాక్టరీ ఉంది. అక్కడ తయారయ్యే సబ్రీనా అనే బొమ్మలను పిల్లలు చాలా ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వాన్యాకు కూడా ఆ బొమ్మను ఇవ్వాలని ఈడెన్ భావిస్తాడు. ఒక పెద్ద సబ్రీనా బొమ్మను తయారుచేస్తాడు. దాన్ని వాన్యా పుట్టినరోజున గిఫ్ట్ గా ఇస్తాడు. దీంతో ఆమె చాలా సంతోషపడుతుంది.
వాన్యా స్కూల్లో ఉండగా, ఆమె క్లాస్‌మేట్.. చార్లీ చార్లీ అనే ఒక ఆట ఆడుతాడు. చనిపోయిన తన అమ్మమ్మ ఆత్మను ఈ ఆట ద్వారా పిలిచి, మాట్లాడుతాడు. ఇది చూసి వాన్యాకు తన తల్లితో మాట్లాడాలని ఉంటుంది. ఆ అబ్బాయి ఈ ఆట గురించి వాన్యాకు చెప్తూ, ఆత్మలను భూమ్మీదకు పిలిచిన తర్వాత, అవి తిరిగి వెళ్లాలంటే కచ్చితంగా ప్రార్థన చేసి, ఆత్మల ప్రపంచానికి మళ్లీ పంపించాలని చెబుతాడు.
ఆ రోజు రాత్రి వాన్యా చార్లీ చార్లీ ఆట ఆడి తన తల్లిని ఆత్మను పిలుస్తుంది. కానీ తన తల్లి కనిపించదు. ఇంతలో మార్యా వచ్చి వాన్యాను తన గదిలో పడుకోబెట్టి తోడుగా సబ్రీనా బొమ్మను ఇస్తుంది. రాత్రి సబ్రీనా బొమ్మ కళ్లు కదపటం కనబడుతుంది. ఆ తర్వాత సబ్రీనా బొమ్మ దానంతట అదే కదలడాన్ని చూసి మార్యా భయపడుతుంది. వాన్యా ఇంకా తన తల్లితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే, మరో ఆత్మ వచ్చి.. ఆమెను బీరువాలోకి లాగి తలుపులు మూసేస్తుంది. ఈ విషయాన్ని తర్వాత రోజు వాన్యా తన ఆంటీతో చెప్తుంది. తల్లి ఆండినీ ఈ లోకంలో లేదని మార్యా చెబుతుంది.
ఆరోజు రాత్రి మార్యాకు ఆండినీ కనిపిస్తుంది. చూస్తుండగానే ఆమె దెయ్యంగా మారి, మార్యాను చంపబోతుంది. మార్యా గట్టిగా అరుస్తూ పారిపోతుంది. ఈడెన్ రావటంతో ఆ దెయ్యం వారిద్దరి మీద అటాక్ చేస్తుంది. ఇద్దరూ ఎలాగో తప్పించుకొని పారిపోతారు. వాళ్ల ఇంట్లో ఏదో దెయ్యం ఉందని ఆ ఆత్మను తిరిగి పంపించమని భూత వైద్యులైన లారాస్, బాగాస్ ను కోరుతారు. వారు చార్లీ చార్లీ ఆట సహాయంతో దెయ్యాన్ని పంపించేయాలని ప్రయత్నిస్తారు. కానీ చార్లీ చార్లీ బోర్డ్ ఒక్కసారిగా మంటలు వచ్చి కాలిపోతుంది. లారాస్ ఆ ఆత్మను ఇంట్లో బంధిస్తుంది. వాళ్లు బయటకు వచ్చేటపుడు సబ్రీనా బొమ్మను కూడా తీసుకురావటంతో ఆ ఆత్మ సబ్రీనాలోకి వెళ్తుంది.
వాన్యా చార్లీ చార్లీ ఆడినపుడు ఒక ఆండినీ కాకుండా ఇంకో ఆత్మ కూడా ఈ లోకంలోకి వచ్చిందని తెలుస్తుంది. వాన్యా తల్లిదండ్రుల్ని చంపింది ఎవరు? ఆ ఇంకో ఆత్మ ఎవరిది?చివరికి ఆండినీ తిరిగి స్పిరిట్ లోకానికి వెళ్లిందా? ఇవన్నీ ఒక బ్యాక్ స్టోరీతో ముడిపడి ఉంటుంది. ఈ సినిమా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: అమ్మాయిలను చంపే సైకో కిల్లర్‌కు ట్రాకర్ పెడితే? ఈ మూవీలో హీరోనే ఎక్కువ భయపెడతాడు