తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన జన్మించినది తెలంగాణ గడ్డ మీదే! దక్షిణ భారతంలో తొలి మహిళా పాలకురాలిగా దేశానికి ఆదర్శంగా నిలిచిన రాణీ రుద్రమదేవిదీ తెలంగాణయే. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు సహా ఈ గడ్డ మీద జన్మించిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. అటువంటి మహనుభావులలో కొందరి జీవిత చరిత్రలను డిజిటల్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు నాగబాల సురేష్ కుమార్. 


'తెలంగాణ త్యాగధనులు' వెబ్ సిరీస్ షురూ!
నాగబాల సురేష్ కుమార్ (Nagabala Suresh Kumar) దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ 'తెలంగాణ త్యాగధనులు' (Telangana Tyagadhanuu Web Series). విజన్ వివికె ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా రూపొందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ విజన్ వివికె హౌసింగ్ ఇండియా అధినేత వి. విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవంలో 'వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం' గీతాన్ని సీనియర్ నటి రోజా రమణి ఆవిష్కరించారు. ఎఫ్.డి.సి చైర్మన్ కూర్మాచలం, దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాతలు రాజ్ కందుకూరి, వకుళా భరణం కృష్ణమోహన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు హాజరై వెబ్ సిరీస్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 


నిర్మాత వి విజయ్ కుమార్ మాట్లాడుతూ ''నేను 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. గత ఏడాది నా పుట్టినరోజున రమణా చారి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో 101 మంది టీవీ కార్మికులకు ఉచితంగా నివాస స్థలం ఇచ్చాను. ఈ ఏడాది పుట్టినరోజున 'తెలంగాణ త్యాగధనులు' వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే సబ్జెక్టుతో 'తెలంగాణ  త్యాగధనులు' సిరీస్ రూపొందుతోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్మిస్తున్నా. ఫస్ట్ సీజన్ పూర్తి అయ్యాక ఏ ఓటీటీలో విడుదల చేసేదీ చెబుతాం'' అని చెప్పారు. సిరీస్ ప్రారంభోత్సవంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 


దర్శకుడు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ ''చరిత్రలో తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. రామాయణ, మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఈ గడ్డ మీద దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి జీవిత చరిత్ర ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నాం. తెలంగాణ చరిత్ర తవ్వుకుంటూ పోతే చాలా ఉంది. అందుకని ఎన్ని సీజన్లు చేస్తామనేది ఇప్పుడే చెప్పలేను'' అని చెప్పారు. 


Also Read : ఉదయ భాను రీ ఎంట్రీ - 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?
 
వైభవ్ సూర్య, రామ కృష్ణ, విజయ్, లోహిత్, అమర్, చిత్తరంజన్, సత్యం యబి, ప్రేమ్, బాబ్జి, సుష్మా, పద్మావతి, ప్రీతి, స్వప్న, శ్యామల తదితరులు ఈ వెబ్ సిరీస్ కు కూర్పు : ప్రవీణ్, కళ : రాజేష్, ఛాయాగ్రహణం : గోపి & శంకర్, పాటలు : డా.  వెనిగళ్ళ రాంబాబు, మౌనశ్రీ మల్లిక్,  సంగీతం: ఎస్ ఏ ఖుద్దూస్, నిర్మాత: వి విజయ్ కుమార్,  స్క్రీన్ ప్లే - దర్శకత్వం : నాగబాల సురేష్ కుమార్. 


Also Read రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!