Anil Kapoor’s Subedar Starts Filming: ‘ఫైటర్‘, ‘యానిమల్‘ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన అనిల్ కపూర్.. మరో యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో ‘సుబేదార్’ అనే యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ‘తుమ్హారీ సులు’, ‘జల్సా’ లాంటి సినిమాలను తెరకెక్కించిన సురేష్ త్రివేణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాధికా మదన్ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను షేర్ చేసింది. “ఫ్రంట్ లైన్ నుంచి హోమ్ టౌన్ వరకు ఫౌజీ ఎక్కడా వెనక్కి తగ్గడు” అంటూ అనిల్ కపూర్ ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కొడుతున్న ఫోటోను పంచుకుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘సుబేదార్’ స్ట్రీమింగ్
ఈ ఏడాది మార్చిలో అమెజాన్ ప్రైమ్ వీడియో సుమరు 70 కొత్త టైటిల్స్ ని ప్రకటించింది. వాటిలో అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించే ‘సుబేదార్’ కూడా ఉన్నది. ఆ సమయంలోనే అనిల్ కపూర్ ‘సుబేదార్’ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసింది. ఆ పోస్టర్ లో నటుడు అనిల్ కపూర్ చెక్క కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని, చేతిలో తుపాకీ పట్టుకుని సీరియల్ లుక్ లో కనిపించారు. అనిల్ కపూర్ ‘సుబేదార్‘లో నటించడంతో పాటు విక్రమ్ మల్హోత్రా, సురేష్ త్రివేణితో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ గా ప్రదర్శించబడనుంది.
‘ది నైట్ మేనేజర్’తో ఆకట్టుకున్న అనిల్ కపూర్
అనిల్ కపూర్ ఈ ఏడాది రెండు ఓటీటీ ప్రాజెక్టులలో కనిపించారు. అందులో ఒకటి ‘ది నైట్ మేనేజర్’ కాగా, మరొకటి ‘నైట్ మేనేజర్2’. ‘ది నైట్ మేనేజర్’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాగా, దానికి కొనసాగింపుగా వచ్చిన ‘ది నైట్ మేనేజర్ 2’ జూన్ 30న విడుదల అయ్యింది. ఈ రెండు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ వెబ్ సిరీస్ లో అనిల్ కపూర్ బిజినెస్ పేరుతో అక్రమ ఆయుధాలు సరఫరా చేసే శైలేంద్ర రుంగ్తాగా కనిపించారు. స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గా కావేరి పాత్రలో శోభిత ధూళిపాళ నటించింది.
అనిల్ కపూర్ గురించి..
అనిల్ కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలు గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1979లో ‘హమారే తుమ్హారే’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అద్భుత చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ఇటీవలే సందీప్ వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో కనిపించారు.
Read Also: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్