టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), హీరోయిన్లు నయన్‌ సారిక, తన్వీరామ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘క’ (KA Movie). సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా ‘క’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘క’ సినిమా మీద తనకు ఉన్న నమ్మకం ఎలాంటిదో వివరించే ప్రయత్నం చేశారు.

  


‘క’ బాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా


‘క’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ మూవీ కోసం టీమ్ ఎంతో ఎఫర్ట్ పెట్టిందన్నారు. ‘క’ సినిమా బాగాలేదని ప్రేక్షకులు భావిస్తే తాను సినిమాలను వదిలేయడానికి ఏమాత్రం వెనుకాడనన్నారు. “’క’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. సినిమాలోని ప్రతి సీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా రోజుల పాటు గుర్తుంచుకుంటారు. ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఒకవేళ ఈ మూవీ బాగాలేదని ప్రేక్షకులు భావిస్తే సినిమాలను వదిలేయడానికి ఏమాత్రం వెనుకాడను” అని చెప్పుకొచ్చారు. అటు దీపావళి బరిలో ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ లాంటి సినిమాలు ఉన్నా, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు. “’క’ సినిమా విడుదల రోజునే లక్కీ భాస్కర్’, ‘అమరన్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మీరు  ఆదరిస్తారనే నమ్మకంతో ‘క’ సినిమాను కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అన్నారు.



అమ్మ కూలి పని చేసి మమ్మల్ని పెంచింది


చిన్నప్పుడు తమను పెంచేందుకు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారని కిరణ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. “మా అమ్మ కూలి పని చేసిన మమ్మల్ని పెంచింది. డబ్బుల కోసం మమ్మల్ని ఊళ్లో వదిలేసి ఇతర దేశానికి వెళ్లి కష్టపడ్డారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మతో నేను కనీసం 2 ఏండ్లు కూడా గడపలేదు. ఇప్పుడు నేను సినిమా పరిశ్రమలో మా అమ్మ కంటే ఎక్కువగా కష్టపడుతున్నాను. ‘క’ సినిమాను అభిమానులు అంతా గర్వపడేలా తీశాం” అని కిరణ్ చెప్పుకొచ్చారు.


సినిమాపై అంచనాలు పెంచిన ప్రమోషనల్ కంటెంట్


‘క’ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. 1980 నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతోంది. ఈ సినిమాలో కిరణ్ పోస్టుమ్యాన్ గా నటిస్తున్నారు. తనకు కుటుంబం లేదనే విషయాన్ని మర్చిపోయేందుకు ఊళ్లో వారికి వచ్చిన ఉత్తరాలను చదువుతూ ఉంటారు. ఊరికి ఆపద వస్తే ముందుండి ఎదిరిస్తారు. ఆ సమయంతో తనకు ఎదురైన ఊహించని పరిణామాలు ఏంటనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ‘క’ మూవీపై అంచనాలు పెంచింది. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే కిరణ కెరీర్ కు మాంచి టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం ఉంది.    


Also Readచిరంజీవి లివింగ్ లెజెండ్... మెగాస్టార్ స్పీచ్ తర్వాత నాగార్జున ట్వీట్ వైరల్... ఏమన్నారో చూశారా?