Anupama Parameswaran's Paradha OTT Streaming On Amazon Prime Video: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ సోషల్ డ్రామా 'పరదా' సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా శుక్రవారం నుంచి సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. 'సినిమా బండి', 'శుభం' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా... అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హర్షవర్దన్ కీలక పాత్రలు పోషించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ మూవీని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: 'మిరాయ్' రివ్యూ: క్లైమాక్స్‌లో శ్రీరాముడు వచ్చాడు... తేజా సజ్జా - మంచు మనోజ్ మూవీ హిట్టేనా?
స్టోరీ ఏంటంటే?
ఓ కల్పిత ఊరిలో అనాదిగా వస్తోన్న ఆచారానికి సంబంధించి బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా 'పరదా' మూవీని తెరకెక్కించారు. పడతి అనే గ్రామంలో ఆడవాళ్లు పరదా కప్పుకొని తిరగాలనేదే ఆచారం. ఒకవేళ పొరపాటున పరదా ఎవరైనా తీస్తే ఆ ఊరి గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సిందే. ఇలాంటి టైంలో ఆ ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) పరదా లేని ఫోటో బయటకు వస్తుంది. దీంతో ఆమె చిక్కుల్లో పడుతుంది.
తాను ఆచారాలను పాటించానని... ఆ ఫోటో ఎలా బయటకు వచ్చిందో తెలియదని వేడుకున్నా గ్రామస్థులు ఆమె మాట వినరు. పెద్దలంతా కలిసి అమ్మోరి ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని తీర్మానం చేస్తారు. లేదా ఆమె తప్పు లేదని నిరూపించుకోవాలని అంటారు. తాను ప్రేమించిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్ధానికి ముందే ఈ తతంగం జరుగుతుంది. ఈ క్రమంలో తాను తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ధర్మశాలకు వెళ్తుంది సుబ్బు. అక్కడ ఆమెకు తోడుగా రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఉంటారు. అసలు వారిద్దరూ ఎవరు? పడతి ఊరి వెనుక కఠినమైన కట్టుబాట్లకు కారణాలేంటి? అసలు సుబ్బు తనపై పడిన నిందను తప్పు అని ఎలా నిరూపించుకుంది? పరదా లేని సుబ్బు ఫోటో బయటకు రావడం వెనుక అసలు కారణాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.