Ghudchadi Trailer Out Now: బాలీవుడ్‌లో కామెడీ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. అందుకే అక్కడి మేకర్స్.. ఇలాంటి సినిమాలకు ఫ్రాంచైజ్‌లు కూడా క్రియేట్ చేస్తారు. త్వరలోనే అలాంటి ఒక కామెడీ చిత్రం ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యింది. అదే ‘ఘుడ్‌చడీ’. బిన్నోయ్ కే గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్ సామ్థాన్, ఖుషాలీ కుమార్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ చాలా కాలం తర్వాత ఒక కామెడీ రోల్‌లో కనిపించడానికి సిద్ధమయ్యారు. తాజాగా ‘ఘుడ్‌చడీ’ ట్రైలర్ విడుదలయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


దేశీ అబ్బాయి ప్రేమకథ..


‘ఘుడ్‌చడీ’ ట్రైలర్ ప్రారంభమవ్వగానే ‘‘ఇది నేను. హ్యాండ్‌సమ్ దేశీ అబ్బాయి చిరాగ్’’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటాడు పార్థ్. చిరాగ్ పెళ్లి చూడాలని తన బామ్మ ఆశపడుతుంది. కానీ తనకు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అప్పుడే ఒక కంపెనీలో మార్కెటింగ్ హెడ్‌ దేవికగా ఖుషాలీ కుమార్ ఎంట్రీ ఇస్తుంది. కూల్ అండర్‌వేర్ అనే కంపెనీలో చిరాగ్ పనిచేస్తుంటాడు. దేవిక పనిచేస్తున్న కంపెనీతో పార్ట్‌నర్‌షిప్ చేయడం కోసం అక్కడికి వస్తాడు. తన అండర్‌వేర్ గురించి ప్రమోషన్ చేస్తూ.. ‘‘ఈరోజుల్లో దేవుడు కూడా తన మనుషులకు గ్యారంటీ ఇవ్వడం లేదు, నేతలు వాళ్ల మాటలకు గ్యారంటీ ఇవ్వడం, తల్లులు సైతం వారి పిల్లల విషయంలో గ్యారంటీ ఇవ్వడం లేదు. కానీ మీరు తోడుంటే మేము చాలా దూరం వెళ్తాం’’ అంటూ దేవికకు ఇన్‌డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తాడు చిరాగ్.


అదే ట్విస్ట్..


అలా చిరాగ్, దేవికల ప్రేమకథ మొదలవుతుంది. అప్పుడే కర్నల్ వీర్ శర్మగా సంజయ్ దత్ ఇంట్రడక్షన్. ఒక రోజు ట్రాఫిక్‌లో అందరితో గొడవ పడుతున్న రవీనా టాండన్‌ అలియాస్ మేనికను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు వీర్. కానీ వారికి చాలా కాలం నుండే పరిచయం ఉంటుందని అర్థమవుతుంది. వీర్, మేనిక మాటలను బట్టి వారికి ఒక గతం ఉంటుందని అర్థమవుతుంది. దీంతో వీర్.. మేనికకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడే చిరాగ్.. తన తల్లిదండ్రులు వచ్చి దేవిక తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఒప్పుకున్నారని చెప్తాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్.. దేవిక.. మేనిక కూతురు, చిరాగ్.. వీర్ కుమారుడు అని తెలుస్తుంది.


తండ్రీకొడుకుల ప్రేమ..


ఒకవేళ వీర్, మేనిక పెళ్లి చేసుకుంటే దేవిక.. చిరాగ్‌కు చెల్లి అవుతుంది. ఇది తెలిసి వారందరూ షాకవుతారు. అప్పుడే చిరాగ్, దేవిక మధ్య గొడవలు మొదలవుతాయి. ‘‘మీ నాన్నకు మా అమ్మే దొరికిందా, మీ అమ్మకు మా నాన్నే దొరికాడా’’ అంటూ గొడవపడతారు. కానీ ఇద్దరూ కలిసి దీనికి ఒక పరిష్కారం వెతకాలని అనుకుంటారు. వీర్, చిరాగ్.. ఇద్దరూ వారి ప్రేమ విషయంలో వెనకడుగు వేయడానికి సిద్ధంగా ఉండరు. ‘‘దేవిక మెడలో తాళికట్టాలని అనుకున్నాను. కానీ తన చేతితో రాఖీ కట్టించుకోవాలా’’ అని చిరాగ్ ఫీలవుతూ ఉంటాడు. ఇలా కాస్త సస్పెన్స్, కాస్త కామెడీతో ‘ఘుడ్‌చడీ’ ట్రైలర్‌ను ముగించాడు దర్శకుడు. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఆగస్ట్ 9న నేరుగా జియో సినిమాలో విడుదలకు సిద్ధమయ్యింది.



Also Read: జీవితంలో చాలా కష్టాలు పడ్డా, ఒక్క రూపాయితో అలా చేశా - రవీనా టాండన్