Best Thriller Movie Suggestions On OTT: ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో వేరొకరి ఇంటికి వెళ్తుంది. కానీ ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో, ఎలాంటి వాళ్లో తనకు ముందే తెలియదు. పెళ్లయ్యి అత్తారింట్లో అడుగుపెట్టగానే తనకు మృత్యువు ఎదురయితే ఎలా ఉంటుంది అన్నదే ‘డామ్సెల్’ కథ. కొన్నిరోజుల క్రితం ఓటీటీలో విడుదలయిన ఈ చిత్రం.. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చాలామంది హాలీవుడ్ ప్రేక్షకులు.. ఈ సినిమాను మిల్లీ బాబీ బ్రౌన్ కోసం చూడడం మొదలుపెట్టినా.. మధ్యలోనే స్క్రీన్ ప్లేలో లీనమయిపోయారు. మరికొందరు ఈ క్రమంలో మిల్లీకి ఫ్యాన్స్ అయిపోయారు.


కథ ఏంటంటే.?


ప్రిన్సెస్ ఎలోడి (మిల్లీ బాబీ బ్రౌన్) ఒక రాజ్యానికి యువరాణి. కానీ తన రాజ్యంలో కరువు వల్ల ప్రజలంతా కష్టాలు పడుతుంటారు. అదే సమయంలో ఎలోడికి ధనిక రాజ్యం నుంచి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఆ దేశ యువరాజు హెన్రీ (నిక్ రాబిన్సన్)ని పెళ్లి చేసుకుంటే తమ రాజ్యంలోని కష్టాలు తీరిపోతాయనే నమ్మకంతో ఇష్టం లేకుండానే ఎలోడి పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లికి ఒకరోజు ముందే వరుడు హెన్రీ రాజ్యానికి వెళ్తుంది ఎలోడి కుటుంబం. అక్కడ హెన్రీతో పర్సనల్‌గా మాట్లాడిన తర్వాత ఎలోడికి తను బాగా నచ్చేస్తాడు. కానీ ఎలోడి సవతి తల్లి అయిన లేడీ బేఫోర్డ్‌కు మాత్రం అక్కడి వారి ప్రవర్తన కాస్త సందేహంగా అనిపిస్తుంది. అదే విషయాన్ని బేఫార్డ్‌కు చెప్పినా పట్టించుకోడు. ఎలోడికి చెప్పినా కూడా తను హెన్రీనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్తుంది. హెన్రీ, ఎలోడి పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే తనను ఒక పర్వతం దగ్గరకు తీసుకెళ్తారు. 


అక్కడే హెన్రీ తల్లి క్వీన్ ఇసాబెల్.. ఎలోడికి ఒక కథ చెప్తుంది. కొన్నేళ్ల క్రితం తమ రాజ్యంపై ఒక డ్రాగన్ దాడి చేసిందని, అప్పటి కింగ్ తన కూతుళ్లను డ్రాగన్‌కు అర్పించి రాజ్యాన్ని కాపాడాడు అని ఇసాబెల్ అంటుంది. ఆ తర్వాత ఎలోడి, హెన్రీ చేతులపై కత్తిఘాటు పెట్టి వారి రక్తం కలిసేలా చేతులను కలుపుతుంది. ఆ తర్వాత హెన్నీ ఆమెను ఎత్తుకుంటాడు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి హెన్రీ.. ఉన్నట్టుండి ఎలోడిని పక్కనే ఉన్న గుహలోకి విసిరేస్తాడు. కాసేపటికి తనకు అర్థమవుతుంది. ఆ పెళ్లి అంతా ట్రాప్ అని, తనను డ్రాగన్‌కు బలి ఇవ్వడానికే పెళ్లి చేసుకున్నారని ఎలోడి తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆ గుహలోని డ్రాగన్ నుంచి ఎలోడి ఎలా తప్పించుకుంది, చివరికి తనకు స్వయంగా డ్రాగనే సాయం చేసేలా ఎలా మార్చుకుంటుంది అనేది తెరపై చూడాల్సిన ఆసక్తికర కథ.


అదే మైనస్..


యువరాణి ఎలోడి పాత్రలో మిల్లీ బాబీ బ్రౌన్ నటన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 1 గంట 50 నిమిషాల సినిమాలో దాదాపు మిల్లీనే ఎక్కువగా చూస్తారు ప్రేక్షకులు. తన నటనతోనే సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. తన గౌన్‌తో మెల్లగా ఆ గుహలో నుంచి బయటపడాలని మిల్లీ చేసే సాహసాలు బాగుంటాయి. అనుకోకుండా డ్రాగన్ వచ్చినప్పుడల్లా కాస్త గుండెల్లో దడ పుడుతుంది. సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ‘డామ్సెల్’ను నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు జువాన్ కార్లోస్ ఫ్రెస్నాడిల్లో. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ఎక్కువశాతం పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి.



Also Read: ‘పారాసైట్: ది గ్రే’ వెబ్ సిరీస్ రివ్యూ - పిల్లలు దూరంగా ఉంటే బెటర్, పెద్దలూ మీ గుండె జాగ్రత్త!