Captain Miller OTT Update: సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న రెండు తమిళ సినిమాలు.. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’. ఈ మూవీ తమిళంలో మిక్స్‌డ్ టాక్ దక్కించుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం పరవాలేదనిపించింది. ఇక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో జనవరి 26 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేశారు మేకర్స్. దానికంటే ఒకరోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఏర్పాటు చేశారు. అయినా ఇక్కడ కూడా ‘కెప్టెన్ మిల్లర్’కు మిక్స్‌డ్ టాకే లభించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


స్టార్ క్యాస్టింగ్..


‘కెప్టెన్ మిల్లర్’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే.. సన్ టీవీ (జెమిని టీవీ).. ఈ మూవీని టెలికాస్ట్ చేయడానికి ఒప్పందానికి వచ్చిందని సమాచారం. ఇక ఈ రైట్స్ కోసం ప్రైమ్, సన్ టీవీ ఎంత ఖర్చు పెట్టిందనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించింది. సందీప్ కిషన్‌లాంటి తెలుగు హీరోకు మూవీలో కీలక పాత్రను ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కలిగేలా చేశారు మేకర్స్. శాండిల్‌వుడ్ నుండి శివ రాజ్‌కుమార్‌ను క్యాస్ట్ చేసుకొని అక్కడి ప్రేక్షకుల్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. నివేదితా సతీష్, జాన్, కొక్కేన్, విజయకన్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.


కలెక్షన్స్ తగ్గాయి..


సత్య జ్యోతి ఫిల్మ్ బ్యానర్‌పై ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం తెరకెక్కింది. కలెక్షన్స్ విషయంలో మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించిందా లేదా లాంటి వివరాలు తెలియకపోయినా.. తమిళనాడులో మొదటి మూడురోజులు మాత్రం ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఈ సినిమా మొదటిరోజే రూ.8.80 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. అంతే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి సైతం పాజిటివ్ రివ్యూలను సంపాదించుకుంది. చూసినవారంతా ఎక్కువశాతం పాజిటివ్ రివ్యూలే ఇచ్చినా కూడా ఎందుకో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గిపోతూ వచ్చింది. అలా రెండో రోజు రూ.7.55 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.7.40 కోట్లకు పడిపోయాయి ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్. 


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..


‘కెప్టెన్ మిల్లర్’ అయిపోవడంతో తన తరువాతి సినిమాపై ఫోకస్ పెట్టారు ధనుష్. ప్రస్తుతం తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఒక తెలుగు, తమిళ బైలింగువల్ మూవీని చేయనున్నాడు. ‘డీఎన్ఎస్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో ధనుష్‌తో పాటు సీనియర్ హీరో నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు సీనియర్ హీరోల్లో మల్టీ స్టారర్స్ అంటే ఇష్టపడేవారిలో నాగార్జున కూడా ఒకరు. అందుకే వెండితెరపై ధనుష్, నాగార్జున కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమా అంటే అందులో కచ్చితంగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే రిఫ్రెషింగ్ పాయింట్ ఉంటుందని నమ్ముతున్నారు.


Also Read: డిసప్పాయింట్ చేసిన 'యానిమల్' ఓటీటీ వెర్షన్ - నిరాశకు లోనవుతున్న ఫ్యాన్స్!