Best Thriller Movies On OTT: టైమ్ ట్రావెల్ సినిమాలు అనేవి చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంటాయి. కానీ ఒక్కసారి వాటికి కనెక్ట్ అయితే ఒక రేంజ్‌లో థ్రిల్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అలాగే దర్శకుడు టైమ్ ట్రావెల్ మూవీని సరిగా ప్లాన్ చేయకపోతే.. అది డిసాస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా అన్ని జోనర్లను అద్భుతంగా చూపించే కొరియన్‌లో భాషలో కూడా ఇలాంటి టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ‘ది కాల్’. ఇది గతం నుంచి భవిష్యత్తుకు చేసే కాల్. అలాంటి ఒక ఫోన్ కాల్ వల్ల ఎన్ని విధ్వంసాలు జరిగాయి అన్నదే ఈ సినిమా.
కథ..
సి యోన్ (పార్క్ షిన్ హై).. కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఆ ఇల్లు.. ఊరికి దూరంగా ఉంటుంది. ఆ క్రమంలో తన ఫోన్ పోగొట్టుకుంటుంది. ఆ కొత్త ఇంట్లో తనకు దొరికిన ఒక ల్యాండ్ ఫోన్‌తో తన సెల్ ఫోన్‌కు కాల్ చేస్తూ ఉండగా.. అదే ల్యాండ్ ఫోన్‌కు ఒక కాల్ వస్తుంది. కాల్ చేసింది ఓ యంగ్ సూక్ (జియో జాంగ్ సియో) అనే అమ్మాయి. తన తల్లి తనను చంపాలని అనుకుంటుందని, కాపాడమని కోరుతుంది. ఏం జరుగుతుందో తెలియని సి యోన్.. రాంగ్ నెంబర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అదే రోజు తన నిద్రపోయిన తర్వాత ఇంటి గోడ నుంచి ఏదో శబ్దం వస్తున్నట్టు గమనించిన సి యోన్.. ఆ గోడను బద్దలగొట్టి చూస్తే అక్కడ ఒక బేస్మెంట్ కనిపిస్తుంది. అక్కడ తనకు ఒక డైరీ, కొన్ని ఫోటోలు దొరకగా.. ఆ ఫోటోను తన ఫ్యామిలీ ఫ్రెండ్‌కు వెళ్లి చూపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు యంగ్ సూక్ అని, తన తల్లి ఒక మంత్రగత్తె అని, కొన్నాళ్ల క్రితం వాళ్లు ఆ ఇంట్లో ఉండేవారని చెప్తాడు.
మరుసటి రోజు కూడా యంగ్ సూక్ నుంచి సీ యోన్‌కు కాల్ వస్తుంది. మళ్లీ తన తల్లి తనను కాల్చేయాలని చూస్తుందని కాపాడమని చెప్తుంది. సీ యోన్ మళ్లీ తను రాంగ్ నెంబర్‌కు ఫోన్ చేసిందని చెప్తూ కాల్ కట్ చేస్తుంది. మరోవైపు యంగ్ సూక్‌ను తన తల్లి కాల్చేయాలని చూడగా.. తన తప్పించుకోవడంతో గొడకు నిప్పు అంటుకుంటుంది. అప్పుడే తన ఇంటి బేస్మెంట్ నుంచి మంట రావడాన్ని సీ యోన్ గమనిస్తుంది. అప్పుడే తనకు ఒక విషయం అర్థమవుతుంది. సీ యోన్ ప్రస్తుతంలో ఉండగా.. యంగ్ సూక్ గతం నుంచి తనకు ఫోన్ చేస్తుంది అని స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని యంగ్ సూక్‌కు ఫోన్ చేసి చెప్తుంది.
మొదట్లో తను నమ్మకపోయినా సి యోన్.. తనను నమ్మిస్తుంది. ఇద్దరు స్నేహితులు అవుతారు. యంగ్ సూక్ గతంలో ఉండడంతో సి యోన్ తండ్రిని ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడి తనను బ్రతికేలా చేస్తుంది. అప్పుడే అసలైన కథ మొదలవుతుంది. గతంలో ఉండే యంగ్ సూక్ ఇంటికి స్ట్రాబెర్రీస్ అమ్మే వ్యాపారి వస్తాడు. అతడు కొన్ని స్ట్రాబెర్రీస్ తెస్తాడు. ఇంతలో ఆమెకు సి యోన్ నుంచి కాల్ వస్తుంది. దీంతో ఆమె పైకి వెళ్తుంది. దీంతో స్రాబెర్రీస్‌ను పెట్టేందుకు ఫ్రిజ్ ఓపెన్ చేస్తాడు. అందులో నల్ల కవర్లు కనిపిస్తాయి. వాటి నుంచి వాసన వస్తుండటంతో అవి ఏమిటో అని చూస్తాడు. అందులో మనిషి శరీర భాగాలుంటాయి.
అంతే వాటిని చూడగానే గట్టిగా కేకలు పెడతాడు. దీంతో యంగ్ సూక్ అతడిని చంపేస్తుంది. ఆ అరుపులు విన్న సియోన్‌కు.. అనుమానం వస్తుంది. యంగ్ సూక్ గతంలో చేసిన నేరాలను గురించి సియోన్ తెలుసుకుంటుంది. ఈ విషయాన్ని యంగ్ సూక్‌కు చెబుతుంది. అంతే.. తాను ఎలా అరెస్టు అయ్యానని సియోన్‌ను అడుగుతుంది. ఆ విషయం చెప్పకపోతే గతంలో ఉన్న నీ తండ్రిని చంపేస్తానని బెదిరిస్తుంది. మరి, సి యోన్ ఏం చేస్తుంది? యంగ్ సూక్ చెప్పినట్లే ఆమె తండ్రిని చంపేస్తుందా? ఇవన్నీ తెలియాలంటే.. తప్పకుండా ఓటీటీలో చూడాల్సిందే. ఎందుకంటే.. ఆ తర్వాత వచ్చే ట్విస్టులను చదివితే ఎంజాయ్ చేయలేరు. చూస్తే.. మతి పోతుంది. యంగ్ సూక్ సీరియల్ కిల్లర్‌గా ఎలా మారింది? అనేది తెరపై చూడాల్సిన కథ.
అన్నీ పర్ఫెక్ట్..
ఫస్ట్ హాఫ్ అంతా టైమ్ ట్రావెల్ కథనంతో సాగిన ఈ సినిమా.. సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. మామూలుగా టైమ్ ట్రావెల్ అంటే చాలా లాజిక్స్ ఉంటాయి. ఇక ‘ది కాల్’లో ఏ ఒక్క లాజిక్‌ను కూడా మిస్ చేయకుండా, ప్రేక్షకులను ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు లీ చంగ్ హియోన్. ఇప్పటికే ఇలాంటి టైమ్ ట్రావెల్ కథాంశంతో ఎన్నో తెలుగు సినిమాలు కూడా వచ్చాయి. కానీ గతంలోని పాత్ర సీరియల్ కిల్లర్ అవ్వడం వల్ల ‘ది కాల్’.. వాటన్నింటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. మూవీ చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను ప్రేక్షకులలో నింపగలిగాడు దర్శకుడు. టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ‘ది కాల్’ను చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయొచ్చు.
Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు