చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోలుగా, హీరోయిన్స్‌గా మారినవారు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను మెప్పించినవారే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు ఆ లిస్ట్‌లో యానీ కూడా జాయిన్ అవ్వనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా యానీ చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. అందులో ‘రాజన్న’ ఒకటి. ‘రాజన్న’ చిత్రంలో యానీ చేసిన మల్లమ్మ పాత్ర.. చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్‌లోనే ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు హీరోయిన్‌గా మారిన యానీ.. ‘రాజన్న’ సినీ విశేషాలను గుర్తుచేసుకుంది. దాంతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మరోసారి ప్రేక్షకులతో పంచుకుంది.


‘లూజర్ (Loser)’తో కమ్‌బ్యాక్..
చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు.. పెద్దయిన తర్వాత సినిమాల్లోనే సెటిల్ అవ్వాలి అనే ఆలోచనతో ఉండరు. అందుకే కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగానే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. కానీ కొందరు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన గుర్తింపును చూసి హీరోహీరోయిన్స్ అవ్వాలని అనుకుంటారు. యానీ కూడా అలాగే అనుకుంటున్నానంటూ బయటపెట్టింది. సినిమాల్లోనే పూర్తిస్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకున్న యానీ.. డిగ్రీ పూర్తిచేసింది. ఇప్పుడు తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉన్నాయని అంటోంది. డిగ్రీ పూర్తయ్యే వరకు సినిమాలకు దూరంగా ఉంది. చాలాకాలం తర్వాత ‘లూజర్ (Loser)’ అనే వెబ్ సిరీస్‌తో నటిగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో తను చేసిన రూబీ షబానా పాత్ర తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని యానీ తెలిపింది.


ఎక్కువ హర్ట్ చేసిన విషయం అదే..
హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో చాలామంది దర్శకులు తన దగ్గరకి కథలతో వచ్చారని, కానీ వారి అప్రోచ్ నచ్చక ఒప్పుకోలేదని యానీ అంటోంది. కొన్ని కథలు నచ్చలేదని, కొందరి దర్శకులు నచ్చలేదని, అలా తాను 15 కథలను రిజెక్ట్ చేశానని బయటపెట్టింది. తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్న సమయంలో ఒక పెద్ద సినిమాలో ఎడిటింగ్‌లో తన క్యారెక్టర్‌ను పూర్తిగా కట్ చేశారని చెప్పుకొచ్చింది. కానీ ఆ సినిమా ఏంటి అని మాత్రం చెప్పలేదు. తన కెరీర్‌లో చాలా హర్ట్ అయిన విషయం అదే అని చెప్పింది. ఆ మూవీ హిట్ అయినా కూడా అందులో తన క్యారెక్టర్ లేకపోవడంతో బాధగా అనిపించిందని తెలిపింది.


రాజమౌళి డైరెక్షన్‌లో..
యానీ అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తనకు గుర్తులేదని, ఒకసారి తన అమ్మను అడగగా.. రూ.500 లేదా రూ.1000 అని చెప్పారని చెప్పింది. ‘అనుకోకుండా ఒకరోజు’ కంటే ముందు తను ఒక యాడ్‌లో నటించిందని, అప్పుడే తన ఫస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నానని అంటోంది. చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల స్కూల్‌లో ఇబ్బంది పడ్డానని గుర్తుచేసుకుంది. అందరూ యాటిట్యూడ్ అనుకోకుండా ఉండాలని నవ్వు రాకపోయినా నవ్వేదాన్ని అని చెప్పింది. ఇక ‘రాజన్న’ సినిమా సమయంలో యానీ.. నాగార్జునకు చాలా నచ్చడంతో తనను ఇంటికి తీసుకెళ్లిపోతానని, దత్తత తీసుకుంటానని.. వాళ్ల అమ్మను అడిగినట్టుగా బయటపెట్టింది. ‘రాజన్న’ చిత్రాన్ని రాజమౌళి కూడా కొంతవరకు డైరెక్ట్ చేశారు. అలా ఆయన డైరెక్షన్‌లో కూడా 2, 3 సీన్స్ చేశానని చెప్పింది. ‘లూజర్ (Loser)’ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో నాగార్జునను పదేళ్ల తర్వాత కలిసానని, ముందు గుర్తుపట్టకపోయినా తర్వాత ఆయనే గుర్తుపట్టి మాట్లాడారని చెప్తూ సంతోషపడింది యానీ.


Also read: ‘జైలర్‘ ఓ యావరేజ్ మూవీ, సూపర్ స్టార్ అంత మాట అనేశాడేంటి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial