నారా, నందమూరి కుటుంబాలకు హరికృష్ణ చిన్న కుమారుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) దూరంగా ఉంటున్నారా? ఆయన్ను మిగతా కుటుంబ సభ్యులు దూరం పెడుతున్నారా? అని అడిగితే... రెండు కుటుంబాలు అంటే గిట్టని వారు 'అవును' అని చెబుతారు. రాజకీయ ప్రత్యర్థులు అయితే తెలుగు దేశం పార్టీలో ఎన్టీఆర్ ఉంటే నారా లోకేష్ (Nara Lokesh) కి పోటీ అవుతాడని, అందుకే పార్టీలోకి అతడిని చంద్రబాబు నాయుడు రానివ్వడం లేదని విమర్శలు చేస్తారు. ఆ మధ్య లక్ష్మీ పార్వతి కూడా టీడీపీని జూనియర్ స్వాధీనం చేసుకోవాలని, అదే తన కోరిక అని వెల్లడించారు.
నిజంగా నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? అంటే... ఇటువంటి విమర్శలు, వందంతులపై ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించినది లేదు. అయితే... నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ సతీమణి ప్రణతి ఈ తరహా పుకార్లకు పరోక్షంగా చెక్ పెట్టారు. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...
ప్రస్తుతం హైదరాబాదులో ఫార్ములా రేసులు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రాంతంలో జరుగుతున్న ఆ రేసులకు లోకేష్ భార్య, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, ఎన్టీఆర్ భార్య ప్రణతి కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళడమే కాదు... పక్క పక్కన కూర్చుని నవ్వుతూ సందడి చేశారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటనేది ఆ రేసింగ్ ఈవెంట్ వల్ల ప్రజలకు తెలిసింది.
పెళ్ళికి ముందు... ఎన్టీఆర్, ప్రణతి సంబంధం కుదరడం వెనుక నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆ కుటుంబాలకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చెబుతూ ఉంటారు. ప్రణతి ఎవరో కాదు... చంద్రబాబు మేనకోడలు నార్ని మల్లిక - శ్రీనివాస్ దంపతుల కుమార్తె. అదీ సంగతి!
బెంగళూరు వెళ్లి...
తారకరత్న పరామర్శ!
నందమూరి తారకరత్న అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైతే... బెంగళూరు వెళ్లి ఎన్టీఆర్ పరామర్శించి వచ్చారు. ఆయనతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య బంధం ప్రతి సినిమా వేడుకలో ప్రేక్షకులు చూస్తూ ఉంటారు.
Also Read : 'అమిగోస్' రివ్యూ : నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలకు వస్తే... తనకు 'జనతా గ్యారేజ్' వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సినిమా స్టార్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా, వరల్డ్ సక్సెస్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అది రెండు భాగాలుగా విడుదల అయ్యే అవకాశం ఉంది.
Also Read : హాట్‌స్టార్‌లో తమన్నా సిరీస్ - చిరు, రజనీ సినిమాలపై మిల్క్ బ్యూటీ అప్డేట్స్!
ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.