టాలీవుడ్ కళాకారులు, నిర్మాతల బాగోగుల కోసం సినీ పెద్దలు ఏర్పాటు చేసుకున్న ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్-MAA’కు ఎన్నికలంటే.. ఒకప్పుడు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. చాలా ఎన్నికలు ఏకగ్రీవంగానే సాగాయి. అయితే, కాలక్రమేనా.. ‘మా’లో అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి మా సభ్యులు వర్గాలుగా వీడిపోయి ప్యానెళ్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. దీంతో ‘మా’ ఎన్నికలకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం పెరిగింది. దానికి తోడు రాజకీయాలు కూడా పెరిగాయి. ఈ ఏడాది ప్రకాష్ రాజ్ బరిలోకి దిగడంతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చివరికి టాలీవుడ్‌ను లోకల్-నాన్ లోకల్ ఆర్టిస్టులుగా విభజించి మాట్లాడటం వరకు వెళ్లాయి.
ఈ ఏడాది ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించిన రోజు నుంచి టాలీవుడ్‌లో ‘నాన్ లోకల్’ పాలిటిక్స్ మొదలయ్యాయి. మంచు విష్ణు వర్గం ప్రకాష్ రాజ్ స్థానికుడు కాదని, అధ్యక్ష పదవికి ఎలా పోటీ చేస్తారనే ప్రశ్న లేవనెత్తారు. అయితే, కళాకారులకు ప్రాంతంతో సంబంధం ఉండదని, సేవ చేయాలనే తపన ఉంటే చాలని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. పైగా ప్రకాష్ రాజుకు మెగా బ్రదర్ నాగబాబు కూడా మద్దతు తెలపడంతో వార్ వన్‌సైడ్‌గా మారింది. టాలీవుడ్‌లోని ప్రముఖ తారలంతా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోనే చేరారు. వేర్వేరు ప్యానెళ్లతో పోటీ చేయడానికి సిద్ధమైన హేమ, జీవిత కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోనే చేరారు. దీంతో మంచు విష్ణు కాస్త ఆలస్యంగా తన ప్యానెల్ ప్రకటించారు. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ కూడా మంచు విష్ణు ప్యానెల్‌కే మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.
‘‘తెలుగు పరిశ్రమలో అన్ని భాషలవాళ్లు పనిచేస్తారు. కానీ, ఇక్కడి పరిశ్రమను నడిపేది మాత్రం తెలుగువాళ్లు. ఇతర భాషలవారు ఇక్కడ గెస్టులు. వేరే పదవులకు ఎవరు పోటీ చేసినా పర్వాలేదు. కానీ, అధ్యక్షుడి పోస్టులో మాత్రం తెలుగువారే ఉండాలి’’ అంటూ నరేష్ ‘నాన్ లోకల్’ ప్రస్తావన తీసుకురావడం టాలీవుడ్‌లో చర్చనీయమైంది. సినిమాలకు కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం ఉండదు. మరి, కళాకారులకు సేవలందించే పదవులకు ‘లోకల్-నాన్ లోకల్’ అని ఎలా విభజిస్తారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఇలాంటి ప్రస్తావన వచ్చినా అర్థముంటుందని, నటీనటులకు చెందిన సంఘంలో కళాకారుల సమస్యలు తెలిసిన ఎవరైనా సేవ చేయడానికి ముందుకు రావచ్చని అంటున్నారు. కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. సామాజిక అంశాల్లోనూ నందా ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. కానీ, విజయం సాధించలేదు. ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్.. కళాకారుల సమస్యలను పరిష్కరిస్తాననే హామీతో బరిలో దిగుతున్నారు.
తమిళనాడులో కోలీవుడ్‌కు చెందిన ‘సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఆర్టిస్ట్’ (నడిగర్ సంఘం)లో జనరల్ కార్యదర్శిగా తెలుగువాడైన విశాల్ కృష్ణ రెడ్డిని ఎంపిక చేశారు. తమ భాషకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమిళ సంఘమే.. విశాల్‌ను కీలక పదవికి ఎన్నుకున్నప్పుడు.. ‘మా’లో ప్రకాష్ రాజ్ ఎందుకు పోటీ చేయకూడదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, నడిగర్ సంఘం ఇప్పటిది కాదు.. దాదాపు 69 ఏళ్ల కిందట తెలుగు, తమిళ తారలతో ఏర్పడింది. 1952లో ఏర్పడిన ఈ సంఘానికి తెలుగువారు సైతం అధ్యక్షులుగా పనిచేశారు. 1956లో తిరుపతికి చెందిన చిత్తూరు నాగయ్య, 1959లో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన అంజలీ దేవి కూడా నడిగర్ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. అప్పటికే తెలుగు భాషకు ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయినా సరే.. అప్పట్లో కళాకారుల పట్ల ఇప్పట్లో ఉన్న వివక్ష ఉండేది కాదని నాటి కళాకారులు చెబుతారు.
వేరే రాష్ట్రాల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులను, హీరోయిన్లను తీసుకురావడంపై అప్పటి సీనియర్ నటులు కొందరు బహిరంగంగానే కామెంట్లు చేసేవారు. తెలుగులో ప్రతిభ ఉన్న నటీనటులు ఉన్నా.. టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు పరాయి రాష్ట్రాలపైనే మోజు పడుతున్నారని అన్నారు. అయితే, అప్పట్లో వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు దిగుమతైన హీరోయిన్లు, నటులు తమ ప్రతిభను చూపించి.. తెలుగు భాషను సైతం నేర్చుకుని మనలో ఒక్కరిగా మారిపోయారు. ప్రజలు కూడా వారినీ ఏ రోజూ పరాయి వ్యక్తులుగా చూడలేదు. సినిమాల్లో నటించేందుకు పరాయి హీరోయిన్లు, నటులను దిగుమతి చేసుకుంటారు. మరి, బాధ్యతయుత పదవుల్లో స్థానికులే ఎందుకు ఉండాలని కోరుకుంటారనే ప్రశ్నలు కూడా వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ‘మా’లో 900 మంది సభ్యులే ఉన్నారు. నడిగర్ సంఘంలో సుమారు 3వేల మంది సభ్యులు తెలుగోడిని ఎన్నుకున్నారంటే.. కళకు ప్రాంతంతో సంబంధం లేదనే కదా వారి ఉద్దేశమని అంటున్నారు. పైగా ‘మా’ నిబంధనల్లో తెలుగువారే సభ్యుడిగా చేరాలని, అధ్యక్షుడిగా పనిచేయాలనే నిబంధన కూడా ఏదీలేదు. ఈ నేపథ్యంలో కళాకారుల ప్రతిభను చూడకుండా లోకల్-నాన్ లోకల్ అని ఎలా విభజిస్తారనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.
అయితే.. నరేష్ చెప్పిన మాటల్లోనూ న్యాయం లేకపోలేదని మరికొందరు వాదిస్తున్నారు. విష్ణు ఎప్పుడూ హైదరాబాదులోనే ఉంటారని, అధ్యక్షుడు ఎప్పుడూ మా సభ్యులకు అందుబాటులో ఉండాలని అంటున్నారు. పైగా విష్ణు కుటుంబికులు నటులుగానే కాకుండా నిర్మాతలుగా కూడా కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారని, అధ్యక్షుడు స్థానికుడైతే.. త్వరగా స్పందిస్తాడని తెలుపుతున్నారు. తెలుగు కళాకారుల సమస్యలను తెలుగు వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలరని, పరాయివారికి అర్థం కావని అంటున్నారు. ప్రకాష్ రాజ్ వంటి బిజీ నటులు.. ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఉంటారో తెలియదని.. వెంటనే ఆయన సాయం కావల్సి వస్తే.. సాయం చేయగలరా? అని ప్రశ్నిస్తున్నారు. కళాకారులకు సాయం చేస్తే సరిపోదాని, వారి మనుగడ కోసం సినిమాల్లో అవకాశాలు కూడా కల్పించాలని, అలా చేయడం ప్రకాష్ రాజ్‌కు సాధ్యమా అని అడుగుతున్నారు. అయితే, సినిమాల్లో హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థానికులకు అవకాశం కల్పించని టాలీవుడ్ పెద్దలు.. పదవుల విషయంలో ‘లోకల్-నాన్ లోకల్’ ప్రస్తావన తీసుకురావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’లో ఉన్న 900 మంది సభ్యులు ఇచ్చే తుది తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు