గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై నిర్మాతలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఎలాగైనా టాలీవుడ్ కు పునర్ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఓటీటీల దెబ్బకు థియేటర్లు వెలవెలబోతున్న నేపథ్యంలో మళ్లీ కళకళలాడేలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా నిర్మాతలంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు.  సినీ కార్మికుల వేతనాల పెంపు, థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చు? టికెట్ల ధరలు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ మధ్య పలు సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను  తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు ఈనెల 10 నుంచి అమలు కానున్నట్లు వెల్లడించింది.  ఇంతకీ కొత్త మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సినిమా నిర్మాణ సంబంధ మార్గదర్శకకాలు..


⦿ ఇకపై నటులు/ టెక్నికల్ సిబ్బందికి రోజువారీ వేతనాలు అందించరు.


⦿ రెమ్యునరేన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్సనల్‌ స్టాఫ్‌, లోకల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌, వసతి, స్పెషల్ ఫుడ్ ను కలుపుకొనే నటీనటుల రెమ్యూనరేషన్‌ ఉంటుంది.


⦿ ఆయా పాత్రలు, సినిమాలను బట్టి ఆ మొత్తాన్ని నిర్మాత నిర్ణయిస్తారు. అంగీకరించిన ఒప్పందాలు మినహా నటులకు నిర్మాతలు నేరుగా డబ్బులు ఇవ్వకూడదు. ముఖ్యమైన టెక్నికల్ పర్సన్స్ విషయంలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి.   


⦿ ఆయా సినిమాల షూటింగ్ ప్రారంభానికి ముందే అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ అగ్రిమెంట్ కు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. 


⦿ స్క్రిప్టు అప్‌ డేట్స్‌, కాల్‌ షీట్లు సహా పలు వివరాలను ప్రతి రోజు తప్పకుండా నోట్ చేయాలి.  


ఓటీటీ సంబంధ మార్గదర్శకాలు


ఓటీటీల హవాతో థియేటర్లు మూతపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  అవేంటంటే..


⦿ థియేటర్లలో విడుదలైన సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాల్సి ఉంటుంది.


⦿ అటు  ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు ఏ సంస్థలు తీసుకున్నా.. వాటి వివరాలను బయటకు చెప్పకూడదు. సినిమా టైటిల్స్‌ తో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ వెల్లించడకూడదు.


థియేట్రికల్‌, ఎగ్జిబిషన్కు సంబంధించిన మార్గదర్శకాలు


⦿ వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) విషయంసై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ విషయం గురించి పూర్తి స్థాయిలో చర్చించేందుకు ఈనెల 6న మరోసారి సమావేశం అవుతున్నట్లు వెల్లడించింది. ఆ సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపింది.  


⦿ తెలంగాణలో ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లకు వీపీఎఫ్‌ అందుతుందని తెలిపింది. 


ఫెడరేషన్గురించి కొనసాగుతున్న చర్చలు


⦿ ఫెడరేషన్‌ గురించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నట్లు ప్రకటించింది. తుది నిర్ణయం అనంతరం రేట్‌ కార్డుల వివరాలను అన్ని నిర్మాణ సంస్థలకు అందిస్తామని ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో అన్ని విభాగాలకు సంబంధిచి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది.  ఈ నెల 10 నుంచి నూతన మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.