డ్రగ్స్ కేసులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ప్రశ్నించింది. ముంబయిలోని ఆమె నివాసంలో ఉదయం సోదాలు చేసిన ఎన్‌సీబీ అధికారులు అనన్యా ల్యాప్‌టాప్, మొబైల్స్‌ను సీజ్ చేశారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో అనన్యా చేసిన వాట్సాప్ ఛాటింగ్‌ల గురించి ఎన్‌సీబీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.






తన తండ్రి చుంకీ పాండేతో కలిసి అనన్యా.. ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం వచ్చారు. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాటింగ్‌లలో పలుమార్లు అనన్యా పేరు వచ్చినట్లు ఎన్‌సీబీ తెలిపింది.






డాక్యుమెంట్లు స్వాధీనం..


ఈరోజు ఉదయం షారుక్ ఖాన్ నివాసంలో కూడా ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని పత్రాల కోసం ఆయన నివాసానికి ఎన్‌సీబీ వెళ్లినట్లు సమాచారం. అయితే గౌరీ ఖాన్ బంగ్లాకు కూడా అధికారులు వెళ్లినట్లు వస్తోన్న వార్తలను ఎన్‌సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే ఖండించారు. కేవలం ఆర్యన్ ఖాన్ నివాసమైన మన్నత్‌కు మాత్రమే అధికారులు వెళ్లినట్లు తెలిపారు.