'సైంధవ్' పాన్ ఇండియా ఫిల్మ్. అయితే... ఈ సినిమాతో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. విక్టరీ వెంకటేష్ సినిమా ప్రయాణంలో మైలురాయి, 75వ సినిమాలో నటించే అవకాశం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇందులో యూనిక్ క్యారెక్టర్ చేశానని ఆయన తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ మీడియాతో నవాజుద్దీన్ సిద్ధిఖీ ముచ్చటించారు. ఆయన మాటల్లో సినిమా విశేషాలు...


'సైంధవ్'తో తెలుగు ఎంట్రీ కుదిరింది
''ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తాడు. నేనూ అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశా. అది 'సైంధవ్'తో కుదిరింది. ఇది చాలా ఆసక్తికరమైన కథ. వెంకటేష్ గారితో నటించడం ఎవరికైనా డ్రీం. ఆయనతో కలసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. 'సైంధవ్'లో విలన్ రోల్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. నేను ఎప్పుడూ విలన్, హీరో అని చూడలేదు. పాత్ర ఆసక్తికరంగా ఉందా? లేదా? అని మాత్రమే చూశా. కొన్నిసార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ వచ్చినప్పుడు పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువ లభిస్తుంది. దర్శకుడు శైలేష్ కొలను నా పాత్రను బాగా డిజైన్ చేశారు'' అని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పారు.  


వేరొకరు నాకు డబ్బింగ్ చెప్పడం ఇష్టం ఉండదు
'సైంధవ్'లో తన పాత్రకు నవాజుద్దీన్ సిద్ధిఖీ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ... ''తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరొకరు డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. మరొకరి గొంతు ఉంటే ఆ డెప్త్ రాదని నా ఫీలింగ్. నాది హైదరాబాదీ క్యారెక్టర్ కావడంతో కొంచెం హిందీ, కొంచెం తెలుగు మాట్లాడతా. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే బావుంటుందని... తెలుగు భాషను, భావాన్ని అర్థం చేసుకొని చెప్పా. కొత్త భాష నేర్చుకున్నప్పుడు మొదట్లో కష్టంగా ఉంటుంది. భాష గురించి తెలుస్తున్న కొలదీ సులువు అవుతుంది. ఎంత కష్టమైనా సరే డైలాగులు నేర్చుకుని చెప్పడమే నాకు ఇష్టం. ప్రాంప్టింగ్ తీసుకోను. 'సైంధవ్'లో ప్రతి డైలాగ్ నేర్చుకొని చెప్పాను'' అని అన్నారు. 


వెంకటేష్ గారు హిందీలో చేసిన 'అనారి' చూశా
చాలా తెలుగు సినిమాలు చూశానని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పారు. ''వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ చూస్తుంటా. ఆయన హిందీలో చేసిన 'అనారి' సినిమా కూడా చూశా. ఆయన చాలా కూల్ పర్సన్. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. చిత్రీకరణకు రావడానికి ముందు డైలాగులు అన్నీ నేర్చుకుంటారు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా రిస్క్ తీసుకున్నారు. డూప్ లేకుండా స్వయంగా చేశారు. సినిమాలో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. సినిమా చేసేటప్పుడు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకు సహనం ఎక్కువ. ఆయన నుంచి ఆ లక్షణం తప్పకుండా నేర్చుకోవాలి'' అని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పారు. సినిమాలో కొత్త వెంకీని ప్రేక్షకులు చూస్తారని చెప్పుకొచ్చారు. 


అంత హెవీ యాక్షన్ చేయడం సవాలే!
'సైంధవ్' సినిమాలో చాలా హెవీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని నవాజుద్దీన్ సిద్ధిఖీ వివరించారు. వాటి గురించి ఆయన మాట్లాడుతూ ''యాక్షన్ సీక్వెన్సులు చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. సినిమా చూసినప్పుడు ఇందులో యాక్షన్ ఎంత కష్టమో ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఈ సినిమా శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం. స్పీడుగా  వెళుతున్నా. అకస్మాత్తుగా పెద్ద అల వచ్చింది. ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు... మళ్ళీ బోట్ లో ల్యాండ్ అయ్యా. (నవ్వుతూ) ఆ  సీన్ సినిమాలో ఉంటుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు'' అని అన్నారు. 


Also Readలవర్‌కు హ్యాండ్ ఇస్తున్న 85 శాతం అమ్మాయిలు - రీసెంట్ రీసెర్చ్ గురించి 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ ఏమన్నారంటే?


తెలుగు పరిశ్రమలో నాని, రానాతో కలసి మాట్లాడానని... నటన గురించి చాలా డిస్కస్ చేశామని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పారు. తెలుగులో హీరోలు అందరూ తనకు ఇష్టమని చెప్పారు. ప్రతి ఒక్కరిలో ఓ ప్రత్యేకత ఉంటుందని చెప్పారు. తనకు ఓషో పాత్ర చేయాలని ఉందన్నారు. అవకాశం వస్తే ఆయన బయోపిక్ చేస్తానని, అది తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పారు.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?