నాని నటించిన ‘టక్ జగదీష్’ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నందుకు ఎగ్జిబీటర్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘‘నాని సినిమాల్లో మాత్రమే హీరో.. బయట పిరికోడు’’ అంటూ థియేటర్ యజమానులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్(APFTG) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటీటీలో ‘టక్ జగదీష్’ విడుదల విషయంలో నిర్మాతల నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పినందుకు థియేటర్ యజమానులు నానిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. వారి వ్యాఖ్యలకు నానిని కూడా బాధించాయని తెలిసింది. ఈ నేపథ్యంలో నాని సినిమా ఓటీటీలో విడుదలను వాయిదా వేస్తారని భావించారు. కానీ, నాని శుక్రవారం చేసిన ట్వీట్‌తో అనుమానాలు పటాపంచలయ్యాయి. 


థియేటర్ యజమనులు రెండు విషయాలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. ‘టక్ జగదీష్’ వంటి భారీ చిత్రాన్ని థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీకి అమ్ముకోవడం తగదని తెలిపారు. అలాగే, థియేటర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న నాగచైతన్య చిత్రం ‘లవ్ స్టోరీ’ రిలీజ్ రోజునే ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని కూడా వ్యతిరేకించారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదని కూడా హెచ్చరించారు. ఈ వార్నింగ్‌లకు వెనక్కి తగ్గితే.. నిజంగానే పిరికివాడని అనుకుంటారని నాని భావించాడో ఏమో.. చెప్పిన తేదీకే వస్తున్నా అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో వదిలాడు.


నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాను సెప్టెంబరు 10న వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ‘టక్ జగదీష్’ సినిమా నిర్మాతలు కూడా అదే రోజున అమేజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమయ్యారు. అయితే, ఆ విషయాన్ని ఇన్ని రోజులు బయటకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తేదీలో మార్పు ఉండవచ్చని భావించారు. థియేటర్ యాజమాన్యం సైతం తేదీ మార్పుకు డిమాండ్ చేయడంతో ‘టక్ జగదీష్’ ఆ రోజున రాదని భావించారు. అయితే, సందేహాలకు నాని పుల్‌స్టాప్ పెట్టేశాడు. నాగ ఛైతన్య అభిమానులకు షాకిస్తూ.. ‘టక్ జగదీష్’ విడుదల తేదీని ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆ సినిమాలోని ఓ సీన్‌ ద్వారా సెప్టెంబరు 10న వస్తున్నట్లు చెప్పేశాడు. 


‘‘భూదేవిపురం చిన్న కొడుకు నాయుడుగారి అబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలుపెట్టండి’’ అనే డైలాగ్ ప్రోమోతో విడుదల తేదీని ప్రకటించాడు. పండగకు మన ఫ్యామిలీతో అని ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు నిర్మాతలదే తుది నిర్ణయమని చెప్పిన నాని.. తానే ఓటీటీలో పెట్టేయండి అన్నట్లుగా అనుమతి ఇస్తున్న అన్నట్లుగా ఈ సీన్ ఉందని అంటున్నారు. ఇది తప్పకుండా థియేటర్ యజమానులకు విసిరిన పంచ్ అని మరికొందరు అంటున్నారు. నానిని అనవసరంగా రెచ్చగొట్టారని, లేకపోతే విడుదల తేదీ విషయం గురించి ఆలోచించేవాడని కొందరు తెలుపుతున్నారు. మొత్తానికి నాని ‘టక్ జగదీష్’ విడుదలకైతే సిద్ధమైపోయింది. సెప్టెంబరు 10న నాగ చైతన్యాకి.. నానికి పోటీ.. థియేటర్ vs ఓటీటీలా ఉండబోతుంది. నాని సినిమాను ఓటీటీలో అదే రోజు విడుదల చేయడం వల్ల.. థియేటర్‌లో విడుదలయ్యే ‘లవ్ స్టోరీ’ సినిమాకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతారనేది ఎగ్జిబిటర్ల వాదన. సినిమా చూడాలనిపిస్తే.. ప్రేక్షకుడు ఎప్పుడైనా.. ఎక్కడైనా చూస్తాడని నిర్మాతలు అంటున్నారు. నాని ప్రకటనతో ఎగ్జిబిటర్లకు, నిర్మాతల వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Also Read: ‘వివాహ భోజనంబు’ రివ్యూ.. కరోనాకు కామెడీ ట్రీట్మెంట్