సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ సమావేశం అయ్యానని చిరంజీవి ప్రకటించారు. తాము ఏమేమీ మాట్లాడుకున్నామో వివరించారు. తాను చెప్పినవన్నీ సీఎం జగన్ రాసుకున్నారని.. వారం, పది రోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పారని చిరంజీవి చెప్పారు. చిరు - జగన్ భేటీపై ఇద్దరికీ ఆప్తుడైన నాగార్జున సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. మంచి నిర్ణయం వస్తుందని చెబుతున్నారు. కానీ శుక్రవారం సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మొత్తం ఆశలపై నీళ్లు చల్లేశారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ.. సినీ పరిశ్రమ సంప్రదింపుల కోసం కాదని తేల్చేశారు. చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావని, కుశలప్రశ్నలు మాత్రమేనని ప్రకటించారు. వారిద్దరి మధ్య మాట్లాడుకున్నవన్నీ తమకు చెప్పలేదన్నారు.
Also Read: చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారా ? నిజమా ? మైండ్ గేమా ?
ఓ ముఖ్యమంత్రి అధికారిక సమావేశం నిర్వహిస్తే దానికి సంబంధించి ప్రతి అంశాన్ని నమోదు చేసుకోవడానికి సిబ్బంది ఉంటారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పరు. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పేర్ని నానికి సినిమా ఇండస్ట్రీపై ముఖ్యమంత్రితో చిరంజీవి భేటీ జరిగిందని సమాచారం లేదు. దీంతో ఆ సమావేశం ఉత్తుత్తిదేనా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేవలం పరామర్శల భేటీనేనని పేర్ని తన సొంతానికి ప్రకటన చేయరు. ఆయనకు ఈ అంశంపై స్పష్టమైన అవగాహన ఉండే చేసి ఉంటారని భావిస్తున్నారు.
Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ తర్వాత రోజు రాజకీయ పరమైన అంశాలపై చర్చ జరిగింది. చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని కొన్ని మీడియాల్లో ప్రచారం జరిగింది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని అలాంటి ఆఫర్లు తనకు రావని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు బయట వారికి రాజ్యసభ స్థానం ఇవ్వాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ప్రకటించారు. ఇదంతా ఓ రాజకీయ వ్యూహం అన్న అభిప్రాయాలు వినిపించాయి.
Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు సమస్య లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!
సినీ పరిశ్రమకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వైపు నుంచి పరిష్కారం కావాల్సిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది టిక్కెట్ రేట్లు. దేశంలో ఎలా ఉన్నాయో... ఏపీలోనూ అలాంటి రేట్లే నిర్ధారించాలని టాలీవుడ్ కోరుతోంది. దీనిపై హైకోర్టు సూచనలతో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఎప్పుడు నివేదిక ఇస్తుందో స్పష్టత లేదు. కానీ ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఎప్పుడనేదానిపై స్పష్టత లేదు. చివరికి చిరంజీవిని సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడినా ఏ మాత్రం అడుగు ముందుకు పడలేదని తేలిపోయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి