ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'. విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా సుమ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు లేటెస్టుగా సినిమాలో తొలి పాట 'తిప్పగలనా?'ను విడుదల చేశారు.
'తిప్పగలనా... చూపులు నీ నుంచే? ఏ వైపైనా! ఆపగలనా... అడుగులు నా చెంతే?కాసేపైనా!' అంటూ సాగే ఈ గీతాన్ని రామాంజనేయులు రాయగా... పి.వి.ఎస్.ఎన్. రోహిత్ ఆలపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటలో సుమ కూడా ఉంటారు. అయితే... ఆమెపై తీసిన పాట కాదు ఇది. సినిమాలో జంటగా నటిస్తున్న దినేష్, షాలినిపై తెరకెక్కించినట్టు లిరికల్ వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో సుమ ఫ్యామిలీని కూడా పరిచయం చేశారు. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొస్తుంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.