‘హరి హర వీర మల్లు’ మొదటి పాట విడుదల ఎప్పుడు ఉండవచ్చనే విషయంపై సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్పందించారు. నాలుగు పాటలకు సంబంధించిన పని ఒకేసారి జరుగుతోందని, వాటిలో ఏది ముందు విడుదల చేయాలనే నిర్ణయం క్రిష్ తీసుకుంటారని కీరవాణి ట్వీట్ చేశారు. నాలుగు పాటలకు సంబంధించిన ట్యూన్స్ ఇప్పటికే సిద్ధం అయ్యాయని తెలుస్తోంది.


‘శాకుంతలం’ సినిమాకు గానూ మణిశర్మ అందించిన పాటలు కొత్తదనం, మెలోడీ విషయాల్లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయని కీరవాణి ట్వీట్ చేశారు. దానికి ఒక నెటిజన్ ‘హరి హర వీర మల్లు ఫస్ట్ సింగిల్ కోసం వెయిటింగ్ సార్’ అని రిప్లై ఇచ్చారు. దానికి సమాధానంగా కీరవాణి ‘నాలుగు పాటలకు సంబంధించిన పని ఒకేసారి జరుగుతోందని, వాటిలో ఏది ముందు విడుదల చేయాలనే నిర్ణయం క్రిష్ తీసుకుంటారు.’ అని ట్వీట్ చేశారు.


'హరి హర వీరమల్లు'కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా ఔరంగజేబు పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ నటిస్తున్నారు. 


'హరి హర వీర మల్లు' పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అయితే, బాబీ డియోల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ తెలుగులో అనువాదం అయ్యాయి. ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.    


ఇటీవల సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇప్పుడు బాబీ డియోల్ షెడ్యూల్ కోసం సిటీలోని ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ కారు దిగిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ఇండియన్ సినిమాలో బిగ్ యాక్షన్ స్టార్ అయిన బాబీ డియోల్‌తో పని చేస్తుండటం సంతోషంగా, ఎగ్జైటెడ్ గా ఉంది'' అని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. ఈ ఏడాది దసరా సందర్భంగా ‘హరి హర వీర మల్లు’ విడుదలయ్యే అవకాశం ఉంది.
  
ఈ సినిమాలో నర్గిస్ ఫక్రీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.


'హరి హర వీర మల్లు' సెట్స్ మీద ఉండగా... హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారట. కొన్ని రోజుల క్రితం పూజతో ఆ సినిమా ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు టాక్. డీవీవీ దానయ్య నిర్మాతగా సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా కూడా ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయింది. సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ కూడా ఉంది.