Titan Q3 Results: 2022 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల్లో (Q3FY23) టైటన్ లిమిటెడ్ లాభం 4% తగ్గి రూ. 951 కోట్లకు దిగి వచ్చింది, అంచనాలను అందుకోలేకపోయింది. అంతకుముందు ఏడాది (2021) ఇదే త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 987 కోట్ల నికర లాభం సంపాదించింది.


Q3FY23లో రూ. 1,041 కోట్ల లాభాన్ని టైటన్‌ ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది.


2021 డిసెంబర్‌ త్రైమాసికంలో వచ్చిన రూ. 9,381 కోట్ల ఆదాయంతో పోలిస్తే, 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో అమ్మకాలు 11% పెరిగి ఆదాయం రూ. 10,444 కోట్లకు చేరుకుంది.


"డిసెంబర్‌ త్రైమాసికంలో పండుగల సీజన్‌ కారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్ బలంగా ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో బలమైన బేస్ ఉన్నా కూడా ఈసారి 12% ఆరోగ్యకరమైన రెండంకెల వృద్ధిని సాధించాం" అని టైటన్ మేనేజింగ్ డైరెక్టర్ సి.కె. వెంకటరామన్ చెప్పారు.


జ్యువెలరీ సెగ్మెంట్‌ (Titan jewellery business)
ఆభరణాల వ్యాపారంలో మొత్తం ఆదాయం 11% వృద్ధితో రూ. 9,518 కోట్లకు చేరుకుంది. పండుగ సీజన్‌లో డిమాండ్‌తో ఇండియాలో బిజినెస్‌ 9% పెరిగింది. ఈ విభాగంలో రూ. 1,236 కోట్ల ఎబిట్‌తో 13% ఎబిట్‌ మార్జిన్‌ లెక్క తేలింది. 


ఈ విభాగంలో.. డిసెంబర్‌ త్రైమాసికంలో కొత్తగా 22 స్టోర్లను (కారట్లేన్ మినహా) కంపెనీ ఓపెన్‌ చేసింది. వీటితో కలిపి మొత్తం ఆభరణాల దుకాణాల సంఖ్య 247 నగరాల్లో 510కి చేరుకుంది.


వాచెస్‌ & వేరబుల్స్‌ సెగ్మెంట్‌ (Titan watches and wearables business)
గడియారాలు, వేరబుల్స్‌ వ్యాపారం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 15% వృద్ధితో రూ. 811 కోట్ల మొత్తం ఆదాయాన్ని నమోదు చేసింది. 11% EBIT మార్జిన్‌తో రూ. 89 కోట్ల EBITను ఈ విభాగం నివేదించింది.


ఈ విభాగంలో... డిసెంబర్‌ త్రైమాసికంలో కొత్తగా 48 స్టోర్లను కంపెనీ ప్రారంభించింది. వీటితో కలిపి మొత్తం దుకాణాల సంఖ్య 953 వద్ద ఉంది.


ఐ కేర్ సెగ్మెంట్‌ (Titan eye care business)
ఐ కేర్ విభాగం వ్యాపారంలో 12% వృద్ధితో రూ. 174 కోట్ల ఆదాయం వచ్చింది. EBIT రూ. 32 కోట్లుగా ఉంది. 


ఫ్రాగ్రేన్సెస్‌ & ఫ్యాషన్ యాక్సెసరీస్‌ (F & FA), భారతీయ దుస్తులు వంటి వర్ధమాన వ్యాపారాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి 71% వృద్ధిని నమోదు చేశాయి.


Q3 ఫలితాల ప్రకటన తర్వాత టైటన్‌ షేర్‌ ధర హఠాత్తుగా పడిపోయింది, 2.24% తగ్గి రూ. 2,269.60 వద్దకు చేరింది. ఆ తర్వాత షార్ట్‌ కవరింగ్‌ కారణంగా కోలుకుని రూ. 2,346 దగ్గర ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.