Sajjala Rama Krishna Reddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక ఉద్దేశాలు ఎవరివో అందరికీ తెలుసని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫోన్ ట్యాపింగ్ కుట్ర చంద్రబాబు స్కీం అని ఆరోపించారు. దీంట్లో కోటంరెడ్డి లాంటి వాళ్లు కేవలం పాత్రధారులన్నారు. రాజకీయంగా టీడీపీ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉందని విమర్శించారు. అందుకే లేని విషయాలను ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు సంబంధించి మాట్లాడే అంశాలు లేకపోవడంతోనే టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయిస్తుందన్నారు. ప్రజలకు సంబంధించి మేము చేయాల్సిన పనులు ఉన్నాయని, ఇటువంటి చిల్లర అంశాలు పట్టించుకునే టైం మాకు లేదన్నారు. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలను యాక్టివేట్ చేయటం, పార్టీ నిర్మాణం, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడంపై సీఎం సమావేశంలో సమీక్షించనున్నారని తెలిపారు.
విచారణ అవసరంలేదు
"వచ్చే ఎన్నికల గురించి పార్టీ క్యాడర్ యాక్టివేట్ చేసేందుకు జిల్లా కోఆర్టినేటర్లతో సీఎం జగన్ రివ్యూ మీట్ నిర్వహిస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియోను ఒకరు రికార్డు చేసి బయటకు పంపారు. రికార్డు చేసిన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాలి. అసలు ఫోన్ ట్యాప్ చేస్తే కోటంరెడ్డికి ఎందుకు పంపిస్తారు. ఇదంతా చంద్రబాబు స్కీం. ఆయన వ్యూహంలో భాగంగానే ఇది జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగితే కంప్లైంట్ చేయొచ్చు. కానీ అది ఫోన్ ట్యాపింగ్ కాదు. ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి మెసేజ్ వెళ్లింది దాన్ని కాదనడంలేదు. ఆయన దృష్టికి ఓ ఆడియో వస్తే దానిని కోటంరెడ్డికి ఇన్ఫ్మామ్ చేశారు. లేని సమస్యను క్రియేట్ చేస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. చంద్రబాబు నుంచి హామీ వచ్చాక ఈ డ్రామా చేస్తున్నారు. ట్యాపింగ్ కానప్పుడు విచారణ ఎందుకు చేయాలి. ఇది కేవలం నాలుగు జరిగే డ్రామా. చంద్రబాబు టైంలో జరిగాయి ఇలాంటివి. మాకు చాలా పనులు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. వీటిలో మేం ఫోకస్ పెట్టాం. ఇలాంటి ట్యాపింగ్ మాకు అవసరంలేదు." - సజ్జల
పేర్ని నాని కౌంటర్
ఎమ్మెల్యేల మీద నిఘా ఉంటే ఆధారం ఉండాలి కదా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పింది కాల్ రికార్డింగ్ గురించేనని, అది ఫోన్ ట్యాపింగ్ కాదన్నారు. కోటంరెడ్డి ఫోన్ వాట్సాప్ ఛాటింగ్ ను బయటపెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. బయట వైరల్ అవుతున్న ఆడియోను కోటంరెడ్డికి పంపి చెక్ చేసుకుకోమని ఇంటెలిజెన్స్ చీఫ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. కోటంరెడ్డి తన అంతరాత్మని ప్రశ్నించుకోవాలన్నారు. గత ఏడాది డిసెంబర్ 25న చంద్రబాబు ఇంటికి బ్లూ కలర్ బెంజ్ కార్ వేసుకొని కోటంరెడ్డి వెళ్లారని ఆరోపించారు. అంతకు ముందు నుంచే కోటంరెడ్డి లోకేశ్ తో టచ్ లో ఉన్నారన్నారు. సీఎం జగన్ కోటంరెడ్డి తన మనిషి అని విశ్వాసించారన్నారు. జగన్ పిచ్చి మారాజు, అందర్నీ నమ్మేస్తారన్నారు. ఒక చోట పనిచేస్తూ పక్క చూపులు చూస్తే ఎలా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు పక్షులు వలస వెళ్లే కాలం అన్నారు. కోటంరెడ్డి చేసింది కచ్చితంగా నమ్మకద్రోహమే అని పేర్ని నాని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ విభాగం సతీష్ చంద్ర చంద్రబాబు హయాంలో కూడా ఉన్నారన్నారు. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభిమానంతో కాదని, పక్కా ప్లాన్ తో వచ్చిన మాటలు అన్నారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డింగ్ చేసి వైరల్ చేశారని పేర్ని నాని ఆరోపించారు.