ఈ ఏడాదిలో ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. వారిలో సమంత-నాగచైతన్య లాంటి స్టార్ కపుల్ కూడా ఉంది. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నట్లు ప్రకటించింది. కోలీవుడ్ లో ఎన్నో హిట్టు సినిమాలకు మ్యూజిక్ అందించిన డి.ఇమ్మాన్ తన భార్య మోనికా రిచర్డ్ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ పదమూడేళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట గుడ్ బై చెప్పేసింది. 

 

నిజానికి వీరిద్దరూ 2020లోనే విడిపోయారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. దాదాపు ఏడాది తరువాత సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించారు. 2020 నవంబర్ లో మోనికా రిచర్డ్ తో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నానని.. ఇకపై మేం భార్యాభర్తలు కాదని చెప్పారు. మీడియాతో పాటు అందరూ తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా.. జీవితంలో ముందుకు సాగడానికి తమకు సహాయం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. 

 

ఇమ్మాన్ కు మోనికా రిచర్డ్ తో 2008లో వివాహం జరిగింది. ఇమ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా.. మోనికా కంప్యూటర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. 2002లో 'తమిజన్' అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు ఇమ్మాన్. ఇటీవల రజినీకాంత్ నటించిన 'అన్నాత్తే' సినిమా మ్యూజిక్ అందించింది ఆయనే. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన 'విశ్వాసం' సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్నారు.