Prince Cecil and Naresh Agastya's Kali Movie Review In Telugu: ప్రిన్స్ టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత యంగ్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేశారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా 'కలి'. కె. రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణ, శివ శేషు దర్శకత్వంలో లీలా గౌతమ్ వర్మ నిర్మించారు. ఇందులో నరేష్ అగస్త్య మరో హీరో. ప్రిన్స్ భార్య పాత్రలో నేహా కృష్ణన్ నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ (Kali Movie Story): శివరామ్ (ప్రిన్స్) మంచోడు. ఎవరైనా ఏదైనా అడిగితే సాయం చేయడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదు. శివరామ్ మంచితనాన్ని అలుసు చేసుకుని అతడిని చాలా మంది మోసం చేస్తారు. అతనిలోని ఏ లక్షణం అయితే నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుందో... చివరకు ఆ లక్షణం నచ్చడం లేదని అతణ్ణి వదిలేసి వెళ్లిపోతుంది వేద (నేహా కృష్ణన్).


సమాజంలో మనుషుల మధ్య బ్రతకలేనని ఆత్మహత్య చేసుకోవడానికి శివరామ్ రెడీ అవుతాడు. ఉరి వేసుకునే సమయంలో డోర్ కొట్టడంతో వెళ్లి తీస్తాడు. చూస్తే అతని ఎదురుగా ఓ వ్యక్తి (నరేష్ అగస్త్య) ఉంటాడు. భారీ వర్షంలోనూ తడవకుండా వచ్చిన అతడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావని అడిగి విసిగిస్తాడు. కోపంతో వచ్చిన వ్యక్తిని బయటకు గెంటేస్తాడు శివరామ్. తాగిన మత్తులో కింద పడతాడు. 


మత్తు దిగిన తర్వాత చూస్తే శివరామ్ మరణిస్తాడు. అప్పుడు తన దగ్గరకు వచ్చినది కలి యుగాన్ని పాలించే కలి అని తెలుస్తుంది. మళ్లీ వచ్చిన కలి, బతుకు మీద శివరామ్ మనసులో ఆశలు కల్పిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? శివరామ్ మళ్లీ బ్రతికాడా? లేదా? శివరామ్, కలి మధ్య ఏం జరిగింది? శివరామ్ ఆశలతో కలి ఏ విధంగా ఆట ఆదుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Kali Review Telugu): మైథాలజీ నేపథ్యంలో ఇటీవల ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. అయితే... 'కలి' యూనిక్ పాయింట్‌తో తెరకెక్కింది. ఆత్మహత్యకు పాల్పడటం నేరం. ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబంలోని ఇతరుల జీవితాలు, ముఖ్యంగా కట్టుకున్న భార్య, పిల్లల బతుకులు ఏ విధంగా తల్లకిందులు అవుతాయనేది దర్శకుడు శివ శేషు చక్కగా చూపించారు. అయితే... ఆ సందేశానికి మైథాలజీ టచ్ ఇవ్వడంతో సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి.


ప్రజెంట్ సొసైటీలో మంచోడిగా బ్రతకడం కష్టం. అసలు ఎటువంటి కల్మషం లేని మంచోడు కనిపిస్తే 'ఏ మ్యూజియం నుంచి వచ్చాడ్రా' అనుకునే రోజులు. ఇటువంటి సమాజంలో మంచోడు ఎన్ని కష్టాలు పడతాడనేది చూపించడంతో పాటు మనిషి ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పాడు శివ శేషు. అతని ఆలోచన బావుంది. కానీ, ఆచరణలో కొంత తడబాటు కనిపించింది. ముఖ్యంగా విశ్రాంతి వరకు కథను నడిపే విధానంలో యూనిక్ పాయింట్ పక్కన పెట్టి రొటీన్ సన్నివేశాల వైపు వెళ్లారు. ప్రిన్స్ ప్రేమలో పడిన నేహా కృష్ణన్ ఇంటి నుంచి వచ్చేయడం గానీ, ఆ తర్వాత వచ్చే పాటలో గానీ ఎటువంటి కొత్తదనం లేదు. ఆ సన్నివేశాలు బాగా రాసుకుంటే బోర్ కొట్టకుండా ఉండేది. అయితే... ప్రిన్స్, నరేష్ అగస్త్య మధ్య సన్నివేశాల్లో శివ శేషు టాలెంట్ చూపించారు.


'కలి' సినిమాకు ఆన్ స్క్రీన్ హీరోలు ప్రిన్స్ & నరేష్ ఆగస్త్య అయితే... ఆఫ్ స్క్రీన్ మెయిన్ హీరో సంగీత దర్శకుడు జేబీ. ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా తన నేపథ్య సంగీతంలో నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళాడు. ఇక... 'కలి'గా నరేష్ అగస్త్య ఎంట్రీ ఇచ్చే సన్నివేశంలో రీ రికార్డింగ్ ఇంకా బావుంది. ఆ ఒక్క సన్నివేశంతో మళ్లీ సినిమాకు హై ఇచ్చారు. కెమెరా వర్క్ ఓకే. బడ్జెట్ పరిమితులు స్క్రీన్ మీద కనిపించాయి.


Also Read: 'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?



నరేష్ అగస్త్య స్క్రీన్ ప్రజెన్స్, అతని నటన 'కలి'కి మెయిన్ అసెట్. ఇంట్లో బోర్న్ ఫైర్ దగ్గర సన్నివేశంలో క్లోజప్ షాట్ ఉంటుంది. నటుడిగా కమాండ్ చూపించారు. ప్రతి సన్నివేశం కన్విక్షన్‌తో చేశారు. నరేష్ అగస్త్య స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఉంది. శివరామ్ పాత్రలో ప్రిన్స్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అటువంటి క్యారెక్టర్ ఎక్కువ స్కోప్ ఇవ్వదు. కానీ, ఛాన్స్ దొరికినప్పుడు యూజ్ చేసుకున్నాడు. నేహా కృష్ణన్ ఓకే. మిగతా ఆర్టిస్టుల కంటే బల్లికి వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రియదర్శి, బొద్దింకకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ విట్టా కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. 


మెసేజ్ ఓరియెంటెడ్ మైథలాజికల్ థ్రిల్లర్ 'కలి'. స్టార్టింగ్ బావుంటుంది. బాడీని  ఆత్మ పాతి పెట్టడానికి వెళ్లడం, కలియుగం గురించి చెప్పడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. అయితే... ప్రిన్స్, నేహా కృష్ణన్ మధ్య రొటీన్ లవ్ ట్రాక్, మ్యారేజ్ లైఫ్ సీన్స్ బోర్ కొట్టినా... మళ్లీ ఇంటర్వెల్ ముందు రైట్ ట్రాక్ ఎక్కేస్తుంది. 'బ్రో' కాన్సెప్ట్ గుర్తుకు వచ్చినా... ఎండింగ్ వరకు చూసేలా చేసిన క్రెడిట్ నరేష్ అగస్త్య, ప్రిన్స్, సంగీత దర్శకుడు జేబీకి వెళుతుంది. రేటింగ్: 2.5/5


Also Readజోకర్ 2 రివ్యూ: రెండు ఆస్కార్స్, 9 వేల కోట్లు కొల్లగొట్టిన సిన్మాకు సీక్వెల్ - Joaquin phoenix మూవీ ఎలా ఉందంటే?