Bougainvillea Review in Telugu: మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్‌కు (Fahadh Faasil) తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘పుష్ప’ సిరీస్‌లో భన్వర్ సింగ్ షెకావత్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన చేసే ప్రయోగాత్మక చిత్రాలు, విభిన్న పాత్రలతో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు అంటే సినిమాలో ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటుంది అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘బౌగెన్‌విల్లా’ అనే ఇన్వెస్టిగేటివ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది?


కథ: డాక్టర్ రాయిస్ థామస్ (కుంచకో బోబన్), రీతు (జ్యోతిర్మయి) భార్యాభర్తలు. వీరిద్దరూ ఒకరోజు కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దీంతో రీతు గతం మర్చిపోతుంది. రోజువారీ లైఫ్‌లో కూడా తనను మెమొరీ లాస్ సమస్య బాధిస్తూ ఉంటుంది. పిల్లలను స్కూల్‌కు పంపడం, రాయిస్ హాస్పిటల్‌కు వెళ్లాక పనిమనిషి రెమాతో (శ్రింద) కాలక్షేపం చేయడం, అప్పుడప్పుడు బొమ్మలు వేయడం... ఇలా తన జీవితం గడిచిపోతూ ఉంటుంది.


కానీ ఇంతలో వారి జీవితంలోకి ఏసీపీ డేవిడ్ కోషి (ఫహాద్ ఫాజిల్) వస్తాడు. తమిళనాడుకు చెందిన మినిస్టర్ కుమార్తె ఛాయా కార్తికేయన్ (అతీరా పటేల్) మిస్సింగ్ కేసు కేరళలో సంచలనం సృష్టిస్తుంది. ఛాయాను రీతు ఫాలో అవుతున్న సీసీ టీవీ ఫుటేజీ పోలీసులకు దొరుకుతుంది. దీంతో డేవిడ్ కోషి... రీతును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో డేవిడ్ తెలుసుకున్న షాకింగ్ విషయాలు ఏంటి? మాయం అయింది కేవలం ఛాయ మాత్రమేనా... ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఈ సంఘటనల వెనుక ఎవరు ఉన్నారు? అనేది తెలియాలంటే ‘బౌగెన్‌విల్లా’ చూడాల్సిందే.


విశ్లేషణ: మలయాళం థ్రిల్లర్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సింపుల్ స్టోరీలను ఉత్కంఠభరితంగా, అత్యంత సహజంగా తెరకెక్కించడం మలయాళ డైరెక్టర్ల స్పెషాలిటీ. యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. వెంటనే స్టోరీ ఎనిమిది సంవత్సరాల టైమ్ జంప్ అవుతుంది. ఆ తర్వాత రీతు సమస్య ఏంటి? రాయిస్ డైలీ రొటీన్ ఏంటి? ఇవన్నీ చూపించడానికి డైరెక్టర్ కాస్త టైమ్ తీసుకున్నాడు. ఇక్కడ స్టోరీ బాగా నిదానంగా సాగుతుంది. ఆడియన్స్‌లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తి... ఆడియన్స్‌కు సినిమా మీద ఇంట్రస్ట్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు.


ఫహాద్ ఫాజిల్ వచ్చిన దగ్గర నుంచి సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. ఒక హై పాయింట్‌తో సినిమాకు ఇంటర్వల్ కార్డు పడుతుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా కాస్త డౌన్ అవుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ సీన్లు కాస్త రిపీట్ అయినట్లు కనిపిస్తాయి. ఒక ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు ఒకే లూప్‌లో తిరుగుతున్నప్పుడు సీన్లు ఇంట్రస్టింగ్‌గా అనిపించాలి. కానీ ఈ సినిమాలో రిపీట్ అయినట్లు అనిపిస్తాయి. ట్విస్టులు రివీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక సినిమా రొటీన్‌గా మారిపోయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమ్యాక్స్‌లో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక క్లైమ్యాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఊహించడం మాత్రం కష్టమే. ఫస్టాఫ్‌లో సినిమా పేస్ మీద కాన్సన్‌ట్రేట్ చేసి... సెకండాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఒకటిగా ఉండేది.



Also Read'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?


ఈ సినిమాకు సుచిన్ శ్యామ్ అందించిన సంగీతం చాలా పెద్ద ప్లస్. సినిమాలో పాటలేమీ లేవు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. చాలా సీన్లను తన స్కోర్‌తోనే ఎలివేట్ చేశాడు. ఆనంద్ సి.చంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కెమెరా మూమెంట్స్ అయితే హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమాను దర్శకుడు అమల్ నీరద్, నటీనటులు కుంచకో బోబన్, జ్యోతిర్మయిలే నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఇక నటీనటుల విషయానికి వస్తే... జ్యోతిర్మయిగా చేసిన రీతు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. తన క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. అన్నిటినీ ఆమె అత్యద్భుతంగా పోషించారు. రాయిస్ థామస్‌గా నటించిన కుంచకో బోబన్ కూడా బాగా నటించారు. ఆయన పాత్రలో కూడా మల్టీపుల్ లేయర్స్ ఉన్నాయి. ఇక డేవిడ్ కోషి పాత్రకు ఫహాద్ ఫాజిల్ లాంటి నటుడు పోషించాల్సిన స్థాయి లేదు. సినిమాలో ఆయన స్క్రీన్ టైమ్ కూడా లిమిటెడ్‌గానే ఉంటుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... పోస్టర్ల మీద ఫహాద్ ఫాజిల్ బొమ్మ చూసి ఆయన పాత్ర కోసం వెళ్లేటట్లు అయితే అంచనాలు కాస్త తగ్గించుకుని వెళ్లడం బెటర్. ఈ సినిమా తెలుగులో డబ్ అవ్వలేదు. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్‌లు ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చేవరకు ఆగితే ఫ్రీగానే చూసేయచ్చు.


Also Read: 'విశ్వం' ట్విట్టర్ రివ్యూ: యాక్షన్ సీన్లలో బోయపాటిని గుర్తు చేసిన శ్రీను వైట్ల... గోపీచంద్ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?