మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'మా' అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పాటు, జీవితా రాజశేఖర్, హేమా లాంటి వాళ్లు పోటీ చేస్తున్నారు. అయితే తాజాగా నటి హేమకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం 'మా' అధ్యక్షుడు నరేష్ నిధులు దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సభ్యులతో హేమా మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఒకటి బయటకు వచ్చింది. 


'మా' ఎన్నికలు జరగకుండా చేసి.. అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారని హేమ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా.. ప్రస్తుతం ఉన్న ప్యానెల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా.. ఉన్నదంతా ఖర్చు చేస్తున్నట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది హేమ. దీనిపై నరేష్, జీవితా రాజశేఖర్ ఘాటుగా స్పందించారు. హేమ మాటలను తప్పుబట్టారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని.. ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి. 


ఇదిలా ఉండగా.. 'మా' అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లెటర్ రాశారు. 'మా' ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లెటర్ లో పేర్కొన్నారు. ఎన్నికలపై ఇప్పటికే చాలా మంది సభ్యులు బహిరంగంగా అనేక ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల 'మా' ప్రతిష్ట దెబ్బ తింటోందని.. ఎన్నికలు వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందని..అందుకే వెంటనే ఎన్నికలు జరిపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును కోరారు. ఇప్పుడు క్రమశిక్షణ సంఘం కూడా రంగంలోకి దిగడంతో ఎన్నికల వ్యవహారం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. 


ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని సినీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంచు విష్ణు అయితే ఈ విషయంలో పెద్దల మాట వింటానని మాటిచ్చారు. ఇక మిగిలినవాళ్ల పరిస్థితి చూస్తుంటే మాత్రం ఏకగ్రీవానికి ఒప్పుకునేలా కనిపించడం లేదు. మరేం జరుగుతుందో చూడాలి!


Also Read : MAA Godava : "మా"కు తక్షణమే ఎన్నికలు పెట్టాలని చిరంజీవి డిమాండ్..! కృష్ణంరాజుకు లేఖ..!


MAA Naresh: ‘చచ్చిపోతుంటే వదిలేస్తామా?’ హేమాపై జీవిత ఫైర్.. మండిపడ్డ నరేష్!