దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'పెళ్లి సందD'  రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల క్రితం ఇదే 'పెళ్లి సందడి' పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన ఆయన... ఇప్పుడు 'పెళ్లి సందD' సినిమాలో వశిష్ట అనే పాత్రలో నటించారు. ఈ సినిమాతో దర్శకేంద్రుడి శిష్యురాలు గౌరీ రోనంకి డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనకుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. దసరా కానుకగా.. అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నాడు నిర్వహించారు.

 


 

దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అభిమానుల కేకలను ఉద్దేశిస్తూ.. 'మీ కేకలను వింటుంటే ఆ కిక్కే వేరప్పా' అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. ''1996 'పెళ్లి సందడి' 175 డేస్ ఫంక్షన్ కి నేనే గెస్ట్ గా వెళ్లా. ఆ సమయంలో నావి నాలుగైదు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో డల్ గా ఉండేవాడిని. కానీ ఆ ఫంక్షన్ లో ఫ్యాన్స్ అరుపులు విన్నాక.. నాలో తెలియని జోష్ వచ్చింది. ఈరోజు కూడా ఆ జోష్ ఎంతమాత్రం తగ్గలేదు. పాతికేళ్ల తరువాత మళ్లీ 'పెళ్లి సందడి' ఈవెంట్ కి పిలిచారు. రాఘవేంద్రరావు గారితో నాది సుదీర్ఘ ప్రయాణం. 1980లలో ప్రతీ నటుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయాలని తపన పడేవారు. ఆయనతో సినిమా చేయాలని తపిస్తున్న సమయంలో 'అడవి దొంగ' తీశారు. ఆ సినిమా ఆర్థికంగా భారీ విజయాన్ని అందుకుంది. ఆ క్షణాన్న అనుకున్నా.. నాకు తిరుగులేదని. అలాంటి భరోసా నటులకు ఇచ్చే దర్శకుడాయన. ఆయన నన్ను బాబాయ్ అనే పిలిచే పిలుపుకి నేను దాసోహం. నన్ను ఎంతోగానో ప్రోత్సహించారు. ఓ దర్శకుడితో మనస్పర్ధ కలిగింది. వెంటనే షూటింగ్ నుంచి రాఘవేంద్రరావు దగ్గరకు వచ్చేశా.. 'మీలాంటి దర్శకులు ఉండొచ్చు.. కానీ మీలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు లేరు.. నటులను మీలా చూసే గొప్ప గుణం అందరూ నేర్చుకోవాలని చెప్పా'. ఆ మాట విన్న రాఘవేంద్రరావు కళ్లు చెమర్చాయి. నటులను బిడ్డల్లా చూసుకుంటారాయన. పెద్దా, చిన్న అనే తేడా లేకుండా అందరినీ ప్రేమిస్తారాయన. అలాంటి గుణాలు నేటి తరం దర్శకులు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఆయన ఎంతో రొమాంటిక్ ఫెలో.. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా.. నాకు పెళ్లైన కొత్తలో ట్రైన్ లో శోభనం టైప్ లో ఎరేంజ్ చేశారు. సురేఖ అయితే సిగ్గుతో చచ్చిపోయింది. అలాంటి చిలిపి పనులు చేస్తుంటారాయన. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని భావిస్తున్నా..'' అంటూ చెప్పుకొచ్చారు. 

 

పదవి కోసం అంత లోకువ కావాలా..?

 

ఇక స్టేజ్ పై ఉన్న మరో గెస్ట్ వెంకటేష్ గురించి మాట్లాడుతూ.. ''ఎంతో ఆత్మీయంగా ఉంటారని.. నటీనటుల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరం ఉంటే ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు, మాటలు అనడం, అనిపించుకోవడం ఉండదు కదా.. ఏదైనా తాత్కాలికమే.. అవి రెండేళ్లు ఉంటాయా..? మూడేళ్లు ఉంటాయా..? నాలుగేళ్లు ఉంటాయా..? ముఖ్యంగా పదవ్వుల్లాంటివి.. చిన్న చిన్న బాధ్యతల్లాంటివి.. వాటికోసం మాటలు అనడం, అనిపించుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే బయటవాళ్లకు ఎంత లోకువ అయిపోతాం.. అంత లోకువ కావాలా పదవి కోసం..? నేను ఏ ఒక్కరినీ వేలెత్తి చూపడం లేదు.. కొంచెం విజ్ఞతతో, మెచ్యూరిటీతో ప్రతీ ఒక్కరూ ఉండాలి తప్ప.. మన ఆధిపత్యం చూపించుకోవడానికి, ప్రభావం చూపించుకోవడానికి.. అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. ఈ వివాదం ఎవరి దగ్గర మొదలైందో ఆలోచించండి. అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచితే గనుక ప్రతీ ఒక్కరిది వసుధైక కుటుంబమవుతుంది. అంతేకానీ.. ముఖ్యంగా మీడియా వాళ్లకు మనం ఆహరం అయిపోకూడదు. 

 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి