మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఒక సినిమాను పూర్తి చేసిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతున్నారు. ఇటీవల 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) సినిమాలో నటిస్తున్నారు. అలానే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. దీనికి 'భోళా శంకర్'(Bhola Shankar) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు చిరంజీవి పుట్టినరోజు(Chiranjeevi Birthday) సందర్భంగా తాజాగా 'భోళా శంకర్' సినిమా నుంచి ఓ పోస్టర్ ను వదిలారు. 


ఇందులో చిరు తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది(2023) వేసవి కానుకగా ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయనున్నారు. అదే సమయానికి చాలా సినిమాలు రావడానికి రెడీ అవుతున్నాయి. అయినప్పటికీ.. చిరు సమ్మర్ రేసుని మిస్ చేసేలా లేరు. ఇక ఈ సినిమా తమిళ 'వేదాలం'కి రీమేక్ గా తెరకెక్కుతోంది. 


తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ కి మొదట పవన్ కళ్యాణ్ హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి అని క్లారిటీ వచ్చింది.  దర్శకుడిగా కూడా మొదట 'సాహో' ఫేమ్ సుజిత్ అనుకున్నా... సడెన్ గా  మెహర్ రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఆల్రెడీ హిట్టైన కథనే మళ్లీ తెరకెక్కించడం ఊరట కలిగించే విషయం. ఈ సినిమాకి చిరు మానియా కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కనీసం ఈ మూవీతో అయినా మెహర్ రమేష్‌కి లక్ కలిసొచ్చి కెరీర్ టర్న్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో చిరు చెల్లెలుగా జాతీయ పురస్కార గ్రహీత కీర్తీ సురేష్(Keerthi Suresh), చిరు సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) నటిస్తున్నారు. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.


Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్


Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!