రెబల్‌స్టార్ కృష్ణంరాజు మరణంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా కృష్ణంరాజు ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. సోమవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే చిరంజీవి కూడా ప్రభాస్ ఇంటికి చేరుకొని కృష్ణంరాజు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
అలానే ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ''మా ఊరి (పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు) హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నాలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి 'మనవూరి పాండవులు' దగ్గర నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కు నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కి, నా సంతాపాన్ని తెలియజేస్తున్నానంటూ'' రాసుకొచ్చారు.
ఇక సోమవారం నాడు మెగా154 సినిమా షూటింగ్ సెట్స్ లో కృష్ణంరాజు ఫొటో ఏర్పాటు చేసి తన టీమ్ అందరితో కలిసి మరోసారి నివాళులు అర్పించారు చిరంజీవి. ప్రకాష్ రాజ్, దర్శకుడు బాబీ, ఫైటర్స్.. యూనిట్ సభ్యులందరూ కలిసి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు చిరంజీవి.
మెగా154 సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రవితేజను కూడా కీలకపాత్ర కోసం తీసుకున్నారు. కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
ఈ సినిమా కోసం రూ.125 నుంచి రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లు ఖర్చు అవుతుందట. చిరంజీవికి అటు ఇటుగా రూ.40 కోట్లకు పైగానే ఇస్తున్నారు. రవితేజకి రూ.18 కోట్లని టాక్. దర్శకుడు బాబీకి ఎలా లేదన్నా ఐదారు కోట్లు ఇస్తారు. మిగిలిన నటీనటులకు టెక్నీషియన్స్ కు కలుపుకొని రూ.75 కోట్లు దాటేస్తుందట.