TS Assembly Updates: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణ బిల్లులను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకంగా వ్యతిరేకించింది. సోమవారం (సెప్టెంబరు 12) జరిగిన తెలంగాణ శాసనసభలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లుల గురించి చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆ విద్యుత్ సంస్కరణల వల్ల దేశం ఎంతగా నష్టపోవాల్సి వస్తుందో, సీఎం కేసీఆర్ వివరించారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లులు చట్టాలుగా మారి అమలులోకి వస్తే రైతాంగం నష్టపోతుందని వివరించారు. రైతులకు, విద్యుత్ ఉద్యోగులకు వ్యతిరేకంగా సంస్కరణల పేరుతో భయంకరమైన కుట్ర జరుగుతోందని సీఎం కేసీఆర్ ఆక్షేపించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను తాను వ్యతిరేకిస్తున్నాననే ఉద్దేశంతో తెలంగాణ ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. రూ.3 వేల కోట్లకి 18 శాతం వడ్డీ వేసి ఇంకో రూ.3 మూడు వేలకోట్లు కూడా కలిపి మొత్తం రూ.6 వేల కోట్లు కట్టాలని ఆదేశించారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా అంత వడ్డీ ఉండబోదని అన్నారు.
మాకే ఏపీ నుంచి బకాయిలు రావాలి
‘‘నెల రోజుల్లో డబ్బులు కట్టకపోతే చర్యలు తీసుకుంటామని కేంద్రం అంటోంది. మరి ఏపీ నుంచి తెలంగాణకు రూ.17 వేల కోట్లు రావాలి. కృష్ణపట్నంతో పాటు అనేక రంగాల్లో తెలంగాణకు కూడా వాటా ఉంది. మీరు చెబుతున్న రూ.6 వేల కోట్లు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఇప్పించాలి’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
కీలు బొమ్మగా ఏపీ మాజీ సీఎం
పునర్విభజన హామీల అమలు విషయంలోనూ తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ విమర్శించారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరామని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల కేటాయింపుల్లో భాగంగా లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారు. సింగరేణి గనులపై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారు. 2014లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారు. అప్రజాస్వామికంగా తెలంగాణకు చెందిన ఏడు మండలాలపై ఆర్డినెన్స్ (అత్యవసర ఆదేశం) తెచ్చారు. శాసన సభకు ప్రతిపాదించకుండానే మోదీ ప్రధాని అయ్యాక తొలి కేబినెట్ లోనే తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపారని అన్నారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా వాళ్లకే కేటాయించారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో మోదీని విమర్శిస్తున్న తొలి ముఖ్యమంత్రి తానే అని కేసీఆర్ అన్నారు. ఆయన ఫాసిస్ట్ లాగా వ్యవహరించారని, తెలంగాణ పట్ల కర్కశంగా ప్రవర్తించారని అన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
ఇవి సంస్కరణలా?
శ్రీలంకలో ఆదానీకి బొగ్గు కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రధాని మోదీనే ఒత్తిడి చేశారు. ఈ విషయం శ్రీలంకలోని విద్యుత్ శాఖ అధికారే రికార్డెడ్ గా చెప్పారు. ఆస్ట్రేలియాలోనూ బొగ్గు కాంట్రాక్ట్ లు తన మిత్రులకు ఇవ్వాలని మోదీ సిఫార్సు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో 4 వేలకు దొరికే బొగ్గును విదేశాల నుంచి కొనాలని నిబంధన పెడుతున్నారు. 10 శాతం విదేశీ బొగ్గు కొనాలని షరతు విధిస్తున్నారు. అక్కడ ధర 30 వేల దాకా ఉంటోంది. ఇది విద్యుత్ సంస్కరణా? ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడం సంస్కరణ అవుతుందా? విశ్వగురువు (మోదీ) విశ్వరూపం దేశమంతా తెలియాలి.’’ అని కేసీఆర్ అన్నారు.