TS Constable Cutoff Marks Reduced: తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. గతంలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసిన కేసీఆర్ నేడు పోలీస్ జాబ్ రాతపరీక్షలో కటాఫ్ మార్కులను తగ్గిస్తున్నట్లు ప్రకటించి కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. పరీక్షా విధానంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శలు వచ్చిన క్రమంలో సీఎం కేసీఆర్ వారికి కటాఫ్ మార్కులు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. 


కానిస్టేబుల్ అండ్ ఎస్సై పరీక్షలో అభ్యర్థుల యొక్క అర్హత మార్కులను అందరికీ సమానంగా 30 శాతం రావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే అంతక ముందు నిర్వహించిచ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం అర్హత మార్కులు వస్తే.. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వారు. కానీ ఇటీవల వల విడుదల చేసి నోటిఫికేషన్లో అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఈ సారి నెగెటివ్ విధానం కూడా తీసుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. 40 శాతంగా ఉన్న ఓసీ అభ్యర్థులకు 10 శాతం సడలింపు ఇచ్చి, బీసీ అభ్యర్థులకు కూడా 5 శాతం రిజర్వేషన్ సడలింపు ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి సడలింపు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు కూడా రిజర్వేషన్ లో సడలింపు ఇచ్చి.. అర్హత మార్కులను తగ్గించాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షడు మంద కృష్ణ మాదిగతో పాటు.. అశోక్ ఆన్ లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ విద్యార్థులతో కలిసి ఓయూలో ఆందోళనలు చేపట్టారు. తాజాగా కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీ అభ్యర్థులకు అర్హత మార్కుల తగ్గింపుపై క్లారిటీ లేదు.


తెలంగాణలో ఆగస్టు 28న నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 'కీ'ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. దీంతో మార్కులపై ఓ అంచనాకు రావొచ్చు. ముఖ్యంగా సి సిరీస్ ఓఎమ్మార్ షీట్‌లో పొరపాట్లు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రశ్నాపత్నం బుక్ కోడ్‌లో ఆరు సంఖ్య రాగా.. దాని ఎలా బబ్లింగ్ చేయాలో అర్థం కాక అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. 


ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం:
ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కీపై ఏమైనా సందేహాలుంటే ఆగస్టు 31న ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కాగా, అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు విడివిడిగా తగిన ఆధారాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


కానిస్టేబుల్ ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి..  


గత నెలలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్.. 
ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పకడ్బందిగా నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప్రశ్నాపత్రంలో తప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పందించింది. కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్‌లోని ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు జరుగుతోన్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెట్ D లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్ కు ఫిర్యాదులు అందాయని ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. సోషల్  మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. నిపుణుల కమిటీతో చర్చించి వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వివరణ వచ్చేంతవరకు వదంతులు నమ్మొద్దని  శ్రీనివాసరావు పేర్కొన్నారు.


కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.34శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో (97.41 %) హాజరు నమోదుకాగా.. అత్యల్పముగా సత్తుపల్లి జిల్లాలో (83.30 %) నమోదైంది.


Also Read: TSPSC: శరవేగంగా గ్రూప్‌-2, గ్రూప్‌-3 కసరత్తు, త్వరలోనే నోటిఫికేషన్లు!