నిన్న జరిగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా కూడా విష్ణు ప్యానెల్ నుంచి ఎక్కువ మంది పదవులు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 


''అక్టోబర్ 10న జరిగిన ఎన్నికల్లో దేవుడి దయవలన.. మా 'మా' ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్లకు సేవ చేయడానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేయడంతో చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. వారికి కూడా థాంక్స్ చెబుతున్నాను. మా ప్యానెల్ లో ప్రతీ ఒక్కరు కష్టపడ్డారు. కొంతమంది గెలవలేదని నిరాశ ఉంది. కానీ వేరే ప్యానెల్ నుంచి కొంతమంది గెలిచారు. మేమంతా కలిసి పని చేస్తాం'' అన్నారు. 


Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?


ఆ తరువాత నాగబాబు రాజీనామాపై స్పందిస్తూ.. ''నాగబాబు గారు మా కుటుంబ సభ్యులు.. 'మా' అసోసియేషన్ పెద్దల్లో ఒకరు. మనసు కష్టం వలన ఆవేశం వలన రిజైన్ చేసి ఉండొచ్చు కానీ అది నేను యాక్సెప్ట్ చేయను. నిరాశ అందరికీ ఉంటుంది. త్వరలోనే నాగబాబు గారిని కలిసి రాజీనామా యాక్సెప్ట్ చేయడం లేదని నేనే పెర్సనల్ గా చెబుతా..'' అని అన్నారు. 


అలానే ప్రకాష్ రాజ్ రాజీనామా కూడా యాక్సెప్ట్ చేయనని అన్నారు. ప్రకాష్ రాజ్ గారంటే తనకు ఇష్టమని.. మేమంతా సన్నిహితంగానే ఉన్నామని.. మధ్యలో మాటలు అనుకున్నాం.. ఇక జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అభివృద్ధి కోసం పాటు పడాలని అన్నారు. ప్రకాష్ రాజ్ గారి ఐడియాస్ తీసుకుంటానని.. ఆయన సలహాలు, పెద్దరికం తనకు కావాలని అన్నారు. 


ఇక తెలుగువాళ్లే గెలవాలని తను ఎక్కడా అనలేదని.. నాన్ తెలుగు ఫ్యాక్టర్ ప్రకాష్ రాజ్ ఓటమికి కారణమంటే నేను నమ్మనని అన్నారు. 260 మంది ఆయన గెలవాలని కోరుకున్నారని.. వారంతా తెలుగువారే కదా.. ఆయన్ను నమ్మే కదా.. ఆ ఓట్లు వేశారని ప్రశ్నించారు.


ఆ తరువాత మెగాఫ్యామిలీపై కామెంట్స్ చేస్తూ..  ''రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు.. కానీ ఆయన ఓటు ప్రకాష్ రాజ్ కే వేసి ఉండొచ్చని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ తన తండ్రి మాట జవదాటడు. నేను కూడా మా నాన్నగారి మాటకే కట్టుబడి ఉంటా. కానీ నాకు ఓటు వేయలేదని బాధలేదు. నన్ను ఎలెక్షన్స్ నుంచి తప్పుకోమని.. చిరంజీవి అంకుల్ మా నాన్నగారిని ఫోన్ చేసి చెప్పారు. నన్ను సైడైపోమని చెప్పిందే ఆయన. కుదరని నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి.'' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. 


తెలుగు భాషను నమ్ముకున్న ప్రతీ ఒక్కరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని.. ప్రకాష్ రాజ్ కి ఓటు వేయొద్దని నేనెవరికీ చెప్పలేదని అన్నారు. 
ఎన్టీఆర్ ఓటు వేయని విషయంపై స్పందిస్తూ.. ''నేను గెలిచిన వెంటనే ఫస్ట్ ఫోన్ చేసింది తారక్. నా తమ్ముడు సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుంది. తన వ్యక్తిగత కారణాల వలన అతడు రాలేదు అంతే.'' అని సమాధానమిచ్చారు. 


శ్రీకాంత్ గారు రిజైన్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన మంచు విష్ణు అందులో నిజం లేదని చెప్పారు. అందరం కలిసి పని చేస్తామని అన్నారు.


Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..


Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 


Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి