మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పంథా మిగతా దర్శకులకు భిన్నంగా ఉంటుంది. తాను తీసే ప్రతి సినిమాలోనూ ప్రతి పాట, మాట, రాత, తీత ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఆయనకంటూ కొన్ని లెక్కలు ఉంటాయి. వాటి ప్రకారమే సినిమా తీస్తారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... తన లెక్కల్లో ఒకటి తీసి పక్కన పెడుతున్నారని టాక్. 


ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ సినిమాలో ఐటమ్ సాంగ్!
ఇప్పటి వరకు త్రివిక్రమ్ తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయలేదు. అఫ్‌కోర్స్‌... ఇప్పుడు ఎవరూ ఐటమ్ సాంగ్స్ అనడం లేదు. స్పెషల్ సాంగ్ లేదంటే ప్రత్యేక గీతం అని అంటున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమాలో త్రివిక్రమ్ ప్రత్యేక గీతం ఒకటి రూపొందించారు. అది కూడా పద్ధతిగా ఉంటుంది. ఈసారి అలా కాకుండా మాస్ సాంగ్ చేయాలని డిసైడ్ అయ్యారట.


మహేష్ సినిమాలో మస్త్ ఐటమ్ సాంగ్!
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్ ఓ సినిమా (SSMB 28) చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో ఐటమ్ సాంగ్ ఉంటుందని, అది కూడా ఇప్పటి వరకు వచ్చిన ఐటమ్ సాంగ్స్ కంటే ఓ మెట్టు పైన ఉండేలా ట్రై చేస్తున్నారని టాక్. అందులో మహేష్ బాబుతో ప్రముఖ హీరోయిన్ స్టెప్స్ మ్యాచ్ చేయనున్నారని సమాచారం.
 
మాంచి ట్యూన్స్ రెడీ చేసిన తమన్!
మహేష్ బాబుకు సూపర్ డూపర్ ఆల్బమ్స్ ఇచ్చిన క్రెడిట్ సంగీత దర్శకుడు తమన్ ఖాతాలో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఆయన ఏ విధమైన సంగీతం ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తున్నారు. పైగా, మహేష్ - త్రివిక్రమ్ కలయికలో తమన్ చేస్తున్న తొలి చిత్రమిది. అందుకని, స్పెషల్ కేర్ తీసుకుని మరీ ట్యూన్స్ చేశారట. మాంచి ట్యూన్స్ నాలుగైదు రెడీ అయ్యాయని, ప్రస్తుతం ఐటమ్ సాంగ్ వర్క్ జరుగుతుందని టాక్.
 
దసరా తర్వాత రెండో షెడ్యూల్... 
మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలైంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ దసరా తర్వాత స్టార్ట్ చేయనున్నారు. ''SSMB 28 మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. కొన్ని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేశాం. అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీ చేసిన అన్బరివు (Anbariv) లకు థాంక్స్. దసరా తర్వాత రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, బుట్టబొమ్మ పూజా హెగ్డే జాయిన్ అవుతారు'' అని ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు.


Also Read : మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత - విషాదంలో కృష్ణ ఫ్యామిలీ


విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.


Also Read : అత్తగారి మరణంతో 'హంట్' టీజర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిన సుధీర్ బాబు