సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి ఇందిరా దేవి (Krishna Wife Indira Devi) ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వయసు పెరగడంతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమె మరణానికి కారణం అని తెలుస్తోంది. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇందిరా దేవికి కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అందువల్ల, ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. సుమారు నెల రోజుల నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్, ఇతర కుటుంబ సభ్యులు తెలుసుకుంటూ ఉన్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ రోజు ఉదయం ఇందిరా దేవి కన్నుమూశారు.
''ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి కొద్దిసేపటి కిందట మృతి చెందారు. ఆవిడ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు'' అని కృష్ణ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు.
కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు... ఇద్దరినీ తెలుగు చిత్రసీమకు హీరోలుగా పరిచయం చేశారు కృష్ణ, ఇందిరా దేవి దంపతులు. రమేష్ బాబు కొన్ని సినిమాలు చేసిన తర్వాత నటన నుంచి విరామం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఆయన మరణించారు. మహేష్ బాబు అగ్ర హీరోగా ఎదిగారు. ఆయనకు ఉత్తరాదిలో కూడా ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు.
నాకు దైవంతో సమానం : మహేష్ బాబు
తల్లి అంటే మహేష్ బాబుకు ఎంతో ప్రేమ. పలు సందర్భాల్లో తల్లిపై తనకు ఉన్న గౌరవాన్ని, ప్రేమను ఆయన చాటుకున్నారు. ''అమ్మ అంటే నాకు దైవంతో సమానం. నేను టెన్షన్ పడినా... ఏ విషయంలో అయినా నెర్వస్ గా అనిపించినా... అమ్మ దగ్గరకు వెళ్లి ఆవిడ పెట్టిన కాఫీ తాగుతాను. నా టెన్షన్ మొత్తం పోతుంది'' అని మహేష్ చెబుతుంటారు.
ఏడాది ప్రారంభంలో అన్నయ్య రమేష్ బాబు మరణం మహేష్ బాబును ఎంతగానో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి ఆయన కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టిందని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు తల్లి మరణం ఆయన్ను మరింత బాధకు గురి చేసింది. మహేష్ బాబు ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదని తెలుస్తోంది.
Also Read : 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!
Also Read : వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!