భారత చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఒకప్పటి బాలీవుడ్ నటి ఆషా పరేఖ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించనుంది. 2020వ సంవత్సరానికి గాను ఆమెకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. భారత ప్రభుత్వం ఆమెకి ఈ పురస్కారాన్నిచ్చి ఇచ్చి గౌరవించనుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం నాడు తెలియజేశారు. 

 

ఆషా పరేఖ్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించాలని కమిటీ నిర్ణయించిందని.. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆమెకు ఈ అవార్డును ఇవ్వబోతున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆమెకు మంత్రిత్వ శాఖ ప్రకటించడం గర్వించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు. ఈ అవార్డుని ఆషా పరేఖ్ శుక్రవారం జరగనున్న 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో అందుకోనున్నారు.

 

79 ఏళ్ల ఆషా పరేఖ్ తన సినీ కెరీర్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పటివరకు ఆమె వీ  సినిమాల్లో నటించారు. ఆమె ఖాతాలో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. 1942లో జన్మించిన ఆమె.. పదేళ్ల వయసులో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టారు. 17 ఏళ్లకే 'దిల్ దేకే దేఖో' అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 

 

అప్పటినుంచి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించారు. 1990లలో 'కోరా కాగజ్' అనే టీవీ సీరియల్ ను డైరెక్ట్ చేయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తరువాత సెన్సార్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈమె జీవిత కథతో 'ది హిట్ గర్ల్' అనే పుస్తకం కూడా వచ్చింది. ఖలీద్ మహమ్మద్ రాసిన ఈ పుస్తకం 2017లో విడుదలైంది. గతంలో ఆషా పరేఖ్ కు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెని వరించనుంది. దీంతో చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు.