‘‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు’’ అన్నట్లుగా మారింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తీరు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మొదట్లో చిన్న వివాదం మాత్రమే ఉండేది. అయితే.. తనకు తానుగా విష్ణు మూర్తిగా ప్రకటించుకుని చక్రం తిప్పడానికి వచ్చిన నరేష్‌తో అసలు పోరు మొదలైంది. వాడీ వేడి మాటల తూటాలు పేల్చుతూ.. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చిన క్రెడిట్ నరేష్‌కే దక్కుతుందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. రాజకీయాల తరహాలో నరేష్ రెచ్చగొట్టి మాట్లాడటం.. ప్రకాష్ రాజ్ సైతం టాలీవుడ్ పెద్దలు నొచ్చుకొనేలా వ్యాఖ్యలు చేయడంతో రచ్చ రోడ్డున పడి.. మీడియాకు ఎక్కింది. ‘మా’ ఎన్నికల సమయంలో నరేష్ చేసిన హడావిడి కూడా అంతా ఇంతా కాదు. ప్రస్తుత అధ్యక్షుడు కాబట్టి.. ఆ మాత్రం చేయకపోతే ఎలా అని చాలామంది అనుకోవచ్చు. కానీ, విష్ణుకు మద్దతుగా ఉంటూ.. అతడి గెలిపించే బాధ్యత తనదే అన్నట్లుగా ఆయన చేసిన ఓవర్ యాక్షన్ చూసి.. మహానటులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే.. విష్ణును నరేష్ దగ్గరుండి మరీ గెలిపించారు. కానీ, అప్పటికే పరిస్థితిని జఠిలం చేసేశారు.
పోలింగ్ రోజున పెత్తనం: వాస్తవానికి పోలింగ్ రోజున కేవలం పోటీలో ఉన్న అభ్యర్థుల హడావిడి మాత్రమే కనిపిస్తుంది. కానీ, ప్యానళ్ల నుంచి పోటీ చేయని మోహన్ బాబు, నరేష్‌లు పెత్తనం చెలాయించడం స్పష్టంగా కనిపించింది. ఓటు వేయడానికి వచ్చినవారిని విష్ణు మంచిగా రిసీవ్ చేసుకుంటూ.. ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా.. నరేష్, మోహన్ బాబులు మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను ఇరకాటంలో పెట్టడానికే ఎక్కువ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా బెనర్జీ, శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. పోలింగ్ కేంద్రాన్ని విష్ణు వర్గం తమ చేతుల్లోకి తీసుకున్నారా అనే సందేహాలు కలగక మానదు. సరే.. జరిగిందేదో జరిగిపోయింది. విజయం తర్వాత అందరినీ కలుపుకుని పోదాం అనే దోరణితో మోహన్ బాబు, విష్ణు వ్యవహరించినా.. నరేష్ మాత్రం ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే ఉన్నారు.
విష్ణు సైలెంట్.. నరేష్ వయొలెంట్: విష్ణు విజయం తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో నరేష్ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. వారి రాజీనామాలను ఆమోదించనని, ప్రతి ఒక్కరినీ కలిసి మాట్లాడి రాజీపడతామని విష్ణు చెప్పారు. అయితే, నరేష్ మాత్రం తన దోరణి మార్చలేదు. మరోసారి ప్రకాష్ రాజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓడిన తర్వాత కలిసి పనిచేస్తామని చెప్పి.. ఇప్పుడు రాజీనామాలు ఎందుకు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విష్ణును ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే బాగోదని హెచ్చరించారు.
చిరంజీవిపై వ్యాఖ్యలు: సాధారణంగా ఇండస్ట్రీలో చిరంజీవికి మంచి పేరు ఉంది. అయితే, నరేష్ ఆయన్ని కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడటం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాసరి నారాయణరావు తర్వాత ఆ ప్లేస్ అలాగే ఉండిపోయింది. చాలా మంది ఆ స్థానం కోసం ప్రయత్నించినా.. ఎవరికీ దక్కలేదు. ఇప్పుడు దాసరి స్థానాన్ని భర్తీ చేసే ఆ అర్హతలు మోహన్ బాబుకు ఉన్నాయి. దాసరి గారు ఉన్నా కూడా ఈ రోజు మోహన్ బాబుకు ఆ బాధ్యతలు ఇచ్చేవారు. ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదు చాలా మంది పెద్దలు ఉన్నారు. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం సరైంది కాదు’’ అని వ్యాఖ్యనించారు.
మంచును ముంచుతారా?: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుకు బాధ్యతలు పెరిగాయి. ఆ స్థానంలో ఉండి అతడి ఏ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి దయనీయంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో నరేష్ వ్యాఖ్యలు విష్ణుకు ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విష్ణు.. రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను బుజ్జగించి రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోకి కూడా నరేష్ దూరినట్లయితే.. మంచుకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఏ ఒక్కరికీ నరేష్ పెత్తనం చేయడం ఇష్టం లేదు. అధ్యక్షుడిగా విష్ణు మాట్లాడినా రాజీకి వచ్చే అవకాశం ఉంది. కానీ, విష్ణుతోపాటు నరేష్ కూడా ఉంటే.. సమస్య చేయిదాటే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘మా’ సంగ్రామంలో నరేష్ విష్ణు మూర్తి కాదని, నారదముని అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విష్ణు ఇప్పటికైనా నరేష్‌ను దూరంగా పెట్టకపోతే.. ముంచడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్‌షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి