మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా).. ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. మెగా కుటుంబం మద్దతుతో పోటీలో నిలబడిన ప్రకాష్ రాజ్‌కు పరాజయం తప్పలేదు. దీంతో చిరంజీవి సోదరుడు, నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్లో  ‘నా’ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. 






 మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. పదవులు కేవలం తాత్కాలికం మాత్రమేనని, అందరం సినీ కళామతల్లి బిడ్డలమని గుర్తుంచుకోవాలని అన్నారు. మా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అందరం కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. పదవుల కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన మరొకర్ని దూషించడం, నిందించడం, దుష్ప్రచారం చేసుకోవడం సరైన పని కాదన్నారు. తాత్కాలిక పదవుల కోసం మనల్ని మనమే తిట్టుకోవడం అవసరమా అని చిరంజీవి ప్రశ్నించారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు అవసరం లేదని, వాటిని పక్కన పెట్టి ముందుకు సాగాలని మా నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు.


పదవుల కోసం సినీ నటులమైన తాము ఒకర్నొకరు తిట్టుకోవడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో చులకన అయిపోతామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కావొద్దని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. వివాదాలు పుట్టించిన వ్యక్తులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరస్పరం తిట్టుకుంటూ పరువు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. తమది వసుదైక కుటుంబమని, కలిసికట్టుగా సినీ పరిశ్రమను డెవలప్ చేసుకోవాలన్నారు. 


Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి