టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, అనీష్ ఆర్ కృష్ణ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ సినిమాతో న్యూజిలాండ్ బ్యూటీ షెర్లీ సేతియా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదల అయ్యింది.  బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దీపావళి కానుకగా ఓటీటీలో విడుదల కాబోతుంది. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.


నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి!


ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. దీపావళి సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టాలని భావిస్తున్నది. అక్టోబర్ 23న ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాను ప్రసారం చేయబోతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది.  


అధికారిక ప్రకటన చేయకపోయినా చేసినట్టే!


ఈ సినిమా స్ట్రీమింగ్ పై నెట్ ఫ్లిక్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ‘కృష్ణ వ్రింద విహారి’ అక్టోబర్‌ 23 నుంచి అందుబాటులోకి రాబోతుందని నెట్‌ ఫ్లిక్స్ లో ఆప్షన్ మాత్రం కనిపిస్తోంది. బయటకు చెప్పకపోయినా..  అధికారిక ప్రకటన వచ్చినట్లుగానే ప్రేక్షకులు భావిస్తున్నారు. థియేటర్లలో జనాలను బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా, ఓటీటీలో ఏమేరకు సత్తా చాటుతుందో చూడాలి.    






సినిమా కథ (Krishna Vrinda Vihari Story): కృష్ణాచారి (నాగశౌర్య) సంప్రదాయాలు పాటించే స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో యువకుడు. తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్) మాట అంటే అతడికి మాత్రమే కాదు. ఆ ఊరిలో అందరికీ వేదవాక్కు. ఆ తల్లి చాటు నుంచి హైదరాబాద్‌కు వెళతాడు కృష్ణ.. ఉద్యోగం రావడంతో! అక్కడ ఆఫీసులో వ్రింద శర్మ (షిర్లే సేతియా)తో ప్రేమలో పడతాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన మోడ్రన్ అమ్మాయి అని చెప్పాలి.


తొలుత కృష్ణ ప్రేమను తిరస్కరించినా.. ఆ తర్వాత ఓకే చెబుతుంది. అయితే... ఒక కండీషన్ పెడుతుంది. తనకు పిల్లలు పుట్టరని, ఆ విషయం మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత, వాళ్ళ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకుందామని అంటుంది. ఇంట్లో అసలు విషయం చెప్పకుండా మరో అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. ఆ తర్వాత ఏమైంది? కృష్ణ, వ్రింద సంసార జీవితంలో ఏం జరిగింది? ట్రెడిషన్ ఫ్యామిలీ, మోడ్రన్ అమ్మాయి మధ్య ఏం జరిగింది? కృష్ణ ఇంట్లో అసలు నిజం తెలిశాక కుటుంబ సభ్యులు ఏమన్నారు? ఈలోపు కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది మిగతా సినిమా.


Also Read: ‘చంద్రముఖి’గా అలరించబోతున్న చందమామ  


Also Read: సినీ లవర్స్‌కు కార్తి దీపావళి కానుక, ‘సర్దార్‘ రిలీజ్ డేట్ ఫిక్స్!