సీనియర్ తమిళ దర్శకుడు పి.వాసు(P Vasu) దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘చంద్రముఖి’. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్యోతిక, నయనతార, ప్రభు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సంచల విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.  మళయాళం హిట్ మూవీ ‘మణిచిత్రతాయు’కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో 2005, ఏప్రిల్ 14న విడుదలయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి అడుగు పెట్టిన ‘చంద్రముఖి’ సినిమా నెమ్మదిగా హిట్ టాక్ అందుకుంది. ప్రేక్షకులు రోజు రోజుకు థియేటర్లకు బారులు తీరారు. అప్పట్లోనే తెలుగులో ఈ సినిమా రూ.13.04 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాలో ‘చంద్రముఖి’ గా జ్యోతిక నట విశ్వరూపం చూపించింది.   


కాజల్ హీరోయిన్ గా ‘చంద్రముఖి-2’


తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతో అలరించిన ఈ సినిమాకు మళ్లీ ఇన్నాళ్లకు  సీక్వెల్ రాబోతుంది. ‘చంద్రముఖి’ సినిమా దర్శకుడు వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి -2 (Chandramukhi -2) తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో మొదలయ్యింది. ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటిస్తున్నాడు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ఫిక్స్ అయ్యింది. ఇందులో ఆమె ‘చంద్రముఖి’ రోల్ పోషించబోతుంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. చివరకు దర్శకుడు వాసు, హీరో లారెన్స్ కాజల్ అయినే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. ఆమెకు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది. ఆమె కెరీర్ లో ఇదో బెస్ట్ సినిమాగా నిలవబోతుందని సినిమా యూనిట్ వెల్లడించింది.  


Also Read: ప్రతిష్టాత్మక మార్వెల్ మూవీస్ విడుదల ఆలస్యం, కారణాలు ఏంటో తెలుసా?


సరికొత్త కథతో తెరకెక్కనున్న ‘చంద్రముఖి-2’


ఈ సినిమా విషయంలో పలు కీలక మార్పులు చేశారట దర్శకుడు వాసు. ‘చంద్రముఖి’ సినిమాలో పలువురు కీలక పాత్రలు నటించగా, సీక్వెల్ లో మాత్రం కేవలం చంద్రముఖి పాత్రనే తీసుకున్నారట. అందులో నటించిన నటీనటులను తీసుకోవడం లేదట. సరికొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో క్యారెక్టర్ తో జ్యోతిక మాదిరిగానే కాజల్ కు మంచి పేరు వస్తుందని దర్శకుడు భావిస్తున్నారట. ప్రస్తుతం  కాజల్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇండియన్-2’లో నటిస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు.  


తమిళ సినిమా పరిశ్రమలో పి. వాసు సీనియర్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. కమర్షియల్ నుంచి కాన్సెప్ట్ బేస్ట్ వరకు ఎలాంటి సినిమానైనా పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుడు. ‘చంద్రముఖి’ సినిమా ఇందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు. మళ్లీ ఇంత కాలానికి ఈ సినిమా సీక్వెల్ చేయడంతో సినీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ‘చంద్రముఖి2’ రెగ్యులర్ షూట్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: బాలీవుడ్ లోకి టీమిండియా గబ్బర్ సింగ్ ఎంట్రీ, హ్యూమాతో శిఖర్‌ డ్యాన్స్‌!