Dozens Of Discarded Bikes: 


యాంస్టర్‌డామ్ కెనాల్‌లో..


నదులు, సముద్రాలను ఎంత కలుషితం చేయాలో అంత కలుషితం చేస్తున్నాం. ఇప్పటికే ఆ నీళ్లలో టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయట పడుతున్నాయి. క్లీన్ చేసిన ప్రతిసారీ కుప్పలుకుప్పలుగా ప్లాస్టిక్ కవర్లు పోగవుతున్నాయి. ఇవే కాదు. మరెన్నో వ్యర్థాలు ఈ నీళ్లలో కలిసి పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే దుస్థితి. దీనికి ఉదాహరణగా...ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. యాంస్టర్‌డామ్‌లో ఓ కెనాల్‌ను శుభ్రం చేయాలని వెళ్లిన సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది. క్రెయిన్‌తో లోపలి వ్యర్థాలను బయటకు తీద్దామని ప్రయత్నిస్తుంటే...ఒకటి తరవాత ఒకటి పాత బైక్‌లు బయటకు వచ్చాయి. అలా పదుల సంఖ్యలో బయట పడుతూనే ఉన్నాయి. 16 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఈ బైక్‌లను నీళ్లలో నుంచి బయటకు తీస్తుండటాన్ని చూడొచ్చు. ఈ నెల 8వ తేదీన ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 80 లక్షల వ్యూస్‌...వందలాది కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అన్ని బైక్‌లను నీళ్లలో పారేశారా అని ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. 






కాలువలే డంపింగ్ యార్డ్‌లు..


"ఓ నాలుగేళ్ల క్రితం నేను యాంస్టర్‌డామ్‌లో బోట్ టూర్ చేశాను. అప్పుడే మా గైడ్‌తో మాతో ఓ విషయం చెప్పాడు. ఈ కెనాల్‌ అడుగులో మూడొంతుల వరకూ సైకిల్సే ఉంటాయని అన్నాడు. బహుశా ఈ వీడియో చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "మొదటి సారి అక్కడికి వెళ్లినప్పుడు అందరూ సైకిళ్లు వాడుతుంటే చూసి మురిసిపోయాను. కానీ...ఇప్పుడిలా నీళ్లలోనూ అవి ఉంటాయని ఊహించలేదు" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. "యాంస్టర్‌డామ్‌లో మొత్తం 160 కెనాల్స్ ఉన్నాయి. అవన్నీ 17వ శతాబ్దంలో కట్టించినవే. అక్కడ ప్రస్తుతం 80 వేలకుపైగా సైకిళ్లున్నాయి. ఏటా...ఈ కెనాల్స్ నుంచి పది వేల సైకిళ్లు బయట పడుతున్నాయి" అని 
ఇంకొందరు అసహనం వ్యక్తం చేశారు.  The Guardian వెల్లడించిన వివరాల ప్రకారం..ఏటా ఇక్కడి కెనాల్స్‌లో వేలాది సైకిళ్లను పారేస్తున్నారు. అసలు ఈ నీళ్లలో ఎన్ని సైకిళ్లు ఉంటాన్నది ఎవరూ చెప్పలేరు. ఎవరైనా సరే..పాత సైకిళ్లను పారేయాలనుకుంటే...వెంటనే కెనాల్స్ మాత్రమే వాళ్లకు గుర్తుకొస్తాయి. చెప్పాలంటే...అదే వాళ్లకు డంప్ యార్డ్‌గా మారిపోతోంది. అధికారులనే కాదు. అక్కడికి వెళ్లే పర్యాటకులకూ ఇది ఇబ్బందికరంగా మారింది. ఎక్కడ చూసినా సైకిళ్ల వ్యర్థాలే కనిపిస్తున్నాయి. 


Also Read: Jharkhand Viral News: హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు- 10 రోజుల్లో ఆలయం ఖాళీ చేయాలట!


Also Read: Actor Priyanth Arrest: ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం ఆరోపణలు, నటుడు ప్రియాంత్ అరెస్ట్!