ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తోంది. మీనా కుటుంబానికి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలుపుతున్నారు. కొందరు సెలబ్రిటీలు మీనా ఇంటికి చేరుకొని విద్యాసాగర్ కి నివాళులు అర్పిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో విద్యాసాగర్ మరణించినట్లు డాక్టర్స్ చెబుతున్నారు. అయితే ఆయన మరణంపై విభిన్న కథనాలను ప్రచురిస్తున్నారు.


ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి మెల్లగా కోలుకున్నారు. మీనా, ఆమె భర్త విద్యాసాగర్, కూతురు నైనికా కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయితే విద్యాసాగర్ కి కోవిడ్ నెగెటివ్ వచ్చినా.. ఆయన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. దీంతో డాక్టర్స్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయాలని సూచించారు. డోనర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో విద్యాసాగర్ ఆరోగ్యం క్షీణించి మరణించారని తెలుస్తోంది. 


అయితే ఆయన మరణానికి పావురాలే కారణమంటూ మరో ప్రచారం జరుగుతోంది. మీనా ఇంటి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉన్నాయని.. అవి విడిచిన వ్యర్ధాల నుంచి వచ్చిన గాలి పీల్చడంతో విద్యాసాగర్ ఆరోగ్యం దెబ్బతిని మరణించారని కథనాలను ప్రచురిస్తున్నారు. ఈ వార్తలపై నటి ఖుష్బూ స్పందించింది. విద్యాసాగర్ మృతి విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మీనా భర్తకు మూడు నెలల క్రితం కోవిడ్ వచ్చిందని.. కరోనా కారణంగా అతడి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యాయని.. కోవిడ్ కారణంగానే విద్యాసాగర్ ని కోల్పోయామని తెలిపింది. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని.. ఎలాంటి భయాలను క్రియేట్ చేయొద్దని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 


Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర


Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి