ప్రతి ఏటా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రధాన మంత్రి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి, లేదంటే ఎవరైనా సెలబ్రిటీ ఈ వేడుకల్లో పాల్గొని రావణ దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి వేడుకల్లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పాల్గొన్నారు.  50 ఏళ్ల చరిత్రలో ఓ మహిళా సెలబ్రిటీ రావణ దహనం చేయడం ఇదే తొలిసారి.  


రావణ దహనానికి ముందు అపశ్రుతి


రామ్ లీలా మైదానంలో రావణ దహనానికి ముందు చిన్న అపశ్రుతి జరిగింది. కంగనా రనౌత్ రావణ దహనం చేయడానికి కొద్ది సేపటి ముందు, రావణుడి దిష్టి బొమ్మ కింద పడింది. వెంటనే కమిటీ సభ్యులు అలర్ట్ అయ్యారు. వెను వెంటనే తిరిగి ప్రతిష్టించారు. ఆ తర్వాత ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కంగనా బాణం విసిరి రావణుడి బొమ్మను దహనం చేశారు.


కంగనాను ఎందుకు ఆహ్వానించారంటే?


వాస్తవానికి ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనాల్సి ఉంది. అయితే, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన చర్యలపై పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంగనా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు, తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించ నేపథ్యంలో,  ఈ సారి రావణ్ దహన్‌ కార్యక్రమానికి రామ్ లీల కమిటీ కంగనాను ఆహ్వానించింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.   


మహిళా బిల్లుకు మద్దతుగా రామ్ లీలా కమిటీ నిర్ణయం


గత నెలలో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ కమిటీ కంగనాను ఆహ్వానించినట్లు లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు సింగ్ తెలిపారు. “సినిమా స్టార్స్ తో పాటు రాజకీయ నాయకులు, ప్రతి ఏటా మా కార్యక్రమానికి వీఐపీలుగా వస్తుంటారు. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు.  అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం కూడా వచ్చారు. గత సంవత్సరం  ప్రభాస్ రావణ్ దహన్ చేశారు. 50 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేడుకలో తొలిసారి ఓ మహిళ రావణ్ దహన్ చేసింది. లవ్ కుశ్ రాంలీలా కమిటీ  మహిళలకు సమాన హక్కులను కోరుకుంటోంది. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇంకా వాళ్లు బాగా రాణించాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశం, సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది" అని సింగ్ అభిప్రాయపడ్డారు.


సంతోషం వ్యక్తం చేసిన కంగనా


ఇక రావణ్ దహణ్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసింది. “50 ఏళ్ల నుంచి వేడుక జరుగుతుంది. కానీ, రావణ్‌ దహన్‌ వేడుకను ఓ మహిళ చేయడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ఇక కంగనా నటించిన ‘తేజస్‌’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. సర్వేష్ మేవారా ఈ సినిమాను తెరకెక్కించారు. రోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial