Telangana TDP : తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. బుధవారం రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీలో చంద్రబాబు అభిప్రాయాన్ని బట్టి కార్యాచరణ ప్రకటిస్తామని కాసాని ప్రకటించారు. ఇప్పటి వరకూ టీడీపీ హైకమాండ్ కు పోటీ చేసే  ఉద్దేశం తక్కువగానే ఉన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పెద్దగా పార్టీ గురించి పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఒక వేళ పార్టీ పోటీ చేయకపోతే.. ఎవరికి మేలు కలుగుతుందన్న దానిపై రాజకీయవర్గాలు భిన్నమైన అంచనాలు వేస్తున్నాయి. 


టీడీపీ హైకమాండ్‌కు పోటీ ఇష్టం లేదా ?


తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హఠాత్తుగా మంగళవారం ఉదయం కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెంటనే స్పందించారు. అతి తప్పుడు ప్రచారం అన్నారు. అయితే టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన చెప్పలేదు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.  తెలంగాణ ఎన్నికల కేంద్రంగా టీడీపీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. టీడీపీ , బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఓ సారి..  టీడీపీ పోటీ నుంచి వైదొలుగుతుందని మరోసారి ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవడం లేదు. చంద్రబాబు అరెస్ట్ అయిన మొదట్లో.. బాలకృష్ణ .. తెలంగాణ టీడీపీ కి తానున్నానని ముందుకు వచ్చారు. అంతా తిరిగి ప్రచారం చేస్తానన్నారు. తర్వాత సైలెంట్ అయ్యారు.   చంద్రబాబు కూడా గతంలో ఓ సారి కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయినప్పుడు ఏ విషయం చెప్పలేదు. కానీ ఆ సమావేశం తర్వాత కాసాని 75 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసుకున్నారు. పోటీ చేస్తామని అంటున్నారు.  అయితే చంద్రబాబు నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. టీడీపీ పోటీ చేయకపోతేనే మంచిదన్న వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. పార్టీ పరంగా ఇప్పుడు  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఆ నిర్ణయంపై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


టీడీపీ పోటీ చేయకూడదనేది బీజేపీ కోరికా ?


తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో  పోటీ చేయకూడదనేది బీజేపీ అభిప్రాయమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తదనంతరం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఇదే రాజకీయం ఉందా అన్న  అనుమానం కూడా సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన నెల రోజులకు.. నారా లోకేష్.. అమిత్ షాను కలిశారు. ఆ సమయంలో అమిత్ తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ చర్చల్లో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ పాత్రపై చర్చకు వచ్చిందో లేదో తెలియదు. కానీ తర్వాత జనసేనతో పొత్తు కోసం.. పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. అది ఏమయిందో తెలియదు కానీ..  జనసేనతో కలిసి పోటీ చేసేందుకు  బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టమయింది. కానీ టీడీపీతో పొత్తులు గురించి ఎవరూ మాట్లడటం లేదు. బహుశా.. టీడీపీ పోటీ చేయకూడదన్నదే  బీజేపీ అభిప్రాయమని చెప్పే వారు ఉన్నారు. అయితే టీడీపీ పోటీ చేయకపోతే బీజేపీకి ఎలా మేలు జరుగుతుందన్నది స్పష్టత లేదు. 


టీడీపీ పోటీ చేయకపోతే కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందా ?


తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే.. ఆ పార్టీ సానుభూతిపురులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారన్న ప్రచారం ఉంది. అయితే ఆ విశ్లేషణ కరెక్ట్ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి టీడీపీకి మద్దతుగా ఉండే సానుభూతిపురుల..  బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే  చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు... ఏపీలో సీఎం జగన్‌కు బీఆర్ఎస్‌కు మద్దతుగా ఉండటం వంటి అంశాలను చూస్తే.  బీఆర్ఎస్‌కు ఈ సారి టీడీపీ సానుభూతిపరులు ఓట్లు వేయరని చెబుతున్నారు. అందుకే వారంతా కాంగ్రెస్ వైపు మళ్లుతారని అంటున్నారు. ఒక వేళ టీడీపీ పోటీ చేస్తే టీడీపీకే వేస్తారని.. దాని వల్ల ఓట్ల చీలిక వస్తుందని చెబుతున్నారు.  ఇలా జరిగే అవకాశం ఉంటే.. బీజేపీ ఖచ్చితంగా టీడీపీ పోటీ కి దూరంగా ఉండాలని కోరుకోదు. 


క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ 


తెలుగుదేశం ఇప్పుడు క్లిష్ట  పరిస్థితుల్లో ఉంది. ఆధారాల్లేని కేసులో జైలులో పెట్టారని ఆక్రోశిస్తున్నారు కానీ..  న్యాయస్థానాల్లో పిటిషన్లు ఆలస్యమవుతున్నాయి. స్కిల్ కేసులో ఏ 1 రెండు, మూడు వారాలకే  బెయిల్ తెచ్చుకోగా..ఏ 37గా ఉన్న చంద్రబాబు మాత్రం 50 రోజులుగా జైల్లో ఉన్నారు. ఇంకా ఎంత కాలం ఉండాలో తెలియడం లేదు. అందుకే తెలంగాణ ఎన్నికలపై టీడీపీ ఎక్కువగా  దృష్టి పెట్టలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది.