షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన తాజా మూవీ ‘పఠాన్’. సుమారు 5 సంవత్సరాల తర్వాత షారుఖ్ మళ్లీ వెండి తెరపై సందడి చేశారు. జనవరి 25న విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
‘పఠాన్’ సినిమా సక్సెస్ తర్వాత నిర్మాత ప్రియా గుప్త ఓ ట్వీట్ చేసింది. హీరో షారుఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణెకు శుభాకాంక్షలు చెప్పింది. ‘‘షారుఖ్‌ను హిందువులు, ముస్లింలు సమానంగా ప్రేమిస్తారు. బాయ్ కాట్ క్యాంపెయిన్ ఈ సినిమాకు నష్టం చేయకపోగా, మరింత సహాయపడ్డాయి. రొమాన్స్, మంచి సంగీతం మ్యూజిక్ మెప్పించాయి. ఇండియా సెక్యులర్ దేశం అనే విషయాన్ని ‘పఠాన్’ నిరూపించింది’’ అని ప్రియా గుప్తా రాసుకొచ్చింది.
ఈ దేశం ఖాన్లను, ముస్లిం హీరోయిన్లను ప్రేమిస్తుంది-కంగనా
ఈ ట్వీట్ పై కంగనా రనౌత్ స్పందించింది. చాలా మంచి విశ్లేషణ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ‘‘ఈ దేశం కొన్ని సందర్భాల్లో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం నటీమణులపైనే అభిమానాన్ని చూపిస్తుంది. అందుకే ఇండియాలో ద్వేషం, ఫాసిజం ఉన్నాయనడం అన్యాయం. ప్రపంచంలో భారత్ లాంటి దేశం మరొకటి లేదు’’ అంటూ కంగనా ట్వీట్ చేసింది.
పాకిస్తాన్, ISI సంస్థను పాజిటివ్ గా చూపించారు-కంగనా
అంతకు ముందు కంగనా ‘పఠాన్’ మూవీపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమా.. పాకిస్తాన్ ని, ISI సంస్థను పాజిటివ్ కోణంలో చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా, భారతీయుల్లోని మెజార్టీ హిందువులు టికెట్లు కొని ఆ సినిమాకి భారీ కలెక్షన్లు సాధించి పెట్టారని కామెంట్ చేసింది.
కంగనా ట్వీట్ పై నెటిజన్ల విమర్శలు
కంగనా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తే కొందరు మండిపడుతున్నారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తూ బాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
‘ఎమర్జెన్సీ’ మూవీ పనుల్లో కంగనా బిజీ బిజీ
కంగనా రనౌత్ తాజాగా ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీలో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు కంగనా నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరిస్తోంది. ఇటీవల పార్లమెంట్ భవనంలో ఈ సినిమా షూటింగ్ కోసం పర్మిషన్ అడిగి కొత్త చర్చకు దారి తీసింది కంగనా.
Read Also: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్‌లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?