లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ బాద్ షా, ‘పఠాన్’తో దుమ్మురేపుతున్నారు. జనవరి 25న  విడుదలైన ‘పఠాన్’ బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. గత రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ సినిమా పరిశ్రమ వెలవెల బోతుండగా, షారుక్ తిరిగి గాడిలోకి తీసుకొచ్చారు. ఆయన నటించిన ఈ మూవీ నార్త్, సౌత్ అని తేడా లేకుండా సంచలన విజయాన్ని నమోదు చేసింది.


ఓవర్సీస్ లోనూ వసూళ్లలో ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాను ఈ స్థాయిలో చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. ‘పఠాన్’ మూవీ చూస్తూ ప్రేక్షకులు నిల్చొని డ్యాన్సులు చేస్తున్నారు. ఈలల మోతలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫారిన్ లో ప్రేక్షకుల సందడి వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.


నెట్టింట వైరల్ గా మారిన థియేటర్ నోటీసు


‘పఠాన్’ చూస్తూ ప్రేక్షకులు చేసే అల్లరిని థియేటర్ల యాజమాన్యాలు తట్టుకోలేకపోతున్నాయి. చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఎంజాయ్ చేయడంతో పాటు గాల్లోకి కాగితాలు విసురుతూ తెగ సరదా పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఓ థియేటర్ యాజమాన్యం పెట్టిన నోటీసు సోషల్ మీడియాలో బాగా సక్క్యులేట్ అవుతోంది. ఫిలడెల్ఫియా థియేటర్‌ లో 'పఠాన్' మూవీ చూసేందుకు వస్తున్న ప్రేక్షకులకు ఓ హెచ్చరిక నోటీసు పెట్టింది. ‘రంగు కాగితాలు విసరడం అనుమతించబడదు' అని ఆ నోటీసులో యాజమాన్యం వెల్లడించింది.  






ఈ నోటీసులు అక్కడికి వెళ్లిన ప్రేక్షకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 5 ఏండ్ల తర్వాత షారుఖ్ సినిమా వస్తే ఆ రేంజిలో ఎంజాయ్ మెంట్ ఉండదా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే, ఇటీవల బాలయ్య నటించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ థియేటర్లో ఫ్యాన్స్ చేసిన హంగామా వల్లే అమెరికాలోని థియేటర్ల యాజమాన్యం ముందస్తుగా ఇలాంటి నోటీసులు పెట్టి ప్రేక్షకులను హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.






కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న ‘పఠాన్‘


2018 సంవత్సరంలో విడుదల అయిన రొమాంటిక్ కామెడీ ‘జీరో’ కమర్షియల్‌గా విఫలం అయ్యాక షారుఖ్ ఖాన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. సుమారు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ‘పఠాన్‘ ఇప్పుడు బాలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించింది.   రూ.250 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో దీపికా పదుకొణె హీరోయిన్ గా చేసింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు.


Read Also: మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి, ‘జబర్దస్త్’పై అదిరే అభి కామెంట్స్!