ఆక్సిటోసిన్ ... దీన్నే శాస్త్రవేత్తలు లవ్ హార్మోన్ అని పిలుస్తారు. ఈ హార్మోన్ మన శరీరంలో ఉండడం వల్లే మనం ఒకరితో ప్రేమలో పడగలుగుతున్నామని, ప్రేమపూరితమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటున్నామని, పిల్లలను ప్రేమతో పెంచుగలుగుతున్నామని, ప్రసవం అయ్యాక తల్లిలో పాల ఉత్పత్తికి కూడా ఇదే కారణమని గత 30 ఏళ్లుగా శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. ఇదే విషయాన్ని మనకు కూడా వారు చెప్పారు. అయితే అదంతా అబద్ధమే అంటూ ఒక కొత్త అధ్యయనంలో తేలింది. ఈ కొత్త అధ్యయనాన్ని దాదాపు 15 ఏళ్లుగా చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో ఆక్సిటోసిన్ అనేది మన జీవక్రియలకు అవసరమైన ఒక హార్మోన్ మాత్రమేనని, అది ప్రేమ హార్మోన్ కాదని తేలింది.
అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఈ లవ్ హార్మోన్ పై గత 15 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు.ఈ హార్మోన్ వల్ల మనిషిలో ప్రేమానురాగాలు కలుగుతాయన్నది నిజమా? కాదా? అని తేల్చడమే వీరి పరిశోధనా ఉద్దేశం. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ఆక్సిటోసిన్ లేకపోయినా కూడా మనం అదే ప్రేమానురాగాలను కలిగి ఉంటామని అధ్యయనంలో తేలింది. దీనికోసం వారు ప్రయరీ ఓల్ అనే జాతికి చెందిన ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఇవి కూడా మనుషుల్లాగే క్షీరదాలు, అంటే పిల్లలకు జన్మనిచ్చి, పాలిచ్చి పెంచుతాయి. వీటిలో కూడా ఆక్సిటోసిన్ ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా కొన్ని మూషికాలకు లవ్ హార్మోన్‌ను తొలగించారు.
ఆక్సిటోసిన్ ఉన్న మూషికాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో? ఆక్సిటోసిన్ తొలగించిన మూషికాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో గమనించడం మొదలుపెట్టారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఇదే పనిలో ఉన్నారు. అయితే ఆక్సిటోసిన్న్ హార్మోన్ ఉత్పత్తి చేయలేని మూషికాలు కూడా సంబంధ బాంధవ్యాలను, ప్రేమానురాగాలను కలిగి ఉండడం గమనించారు. అవి మరొక మూషికంతో ప్రేమలో పడి, పిల్లలకు జన్మనిచ్చి, పాలిచ్చి పెంచాయి. దీన్ని బట్టి ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ కాదని తేల్చారు పరిశోధకులు. అది కేవలం ఇన్నాళ్లు మనం నమ్మిన ఒక అబద్ధమేనని భావిస్తున్నారుజ. సామాజిక బంధాలకూ, ఆక్సిటోసిన్ హార్మోన్లకూ ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. మెదడులో ఆక్సిటోసిన్ విడుదల వల్లే మనం వేరొకరిని ప్రేమిస్తున్నామని అన్నది కేవలం అపోహే అని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. అయితే హ్యాపీ హార్మోన్లలో ఇది ఒక భాగమే. కానీ దీని వల్లే ప్రేమ పుడుతుంది, లైంగిక జీవితం సాగుతుంది అన్నది మాత్రం ఈ పరిశోధన ఒప్పుకోవడం లేదు.
Also read: గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.