ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మళ్లీ రేపు సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్‌ టేబుల్ సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. 
సోమవారం సాయంత్ర తాడేపల్లిలో బయల్దేరనున్న సీఎం జగన్... రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడే జన్‌పథ్‌లో బస చేస్తారు.


రేపు(మంగళవారం) జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్‌ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగనుంది. ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమంలో చాలా మంది దౌత్యవేత్తలు పాల్గొంటారని... సీఎంతో సమావేశమవుతారని ప్రభుత్వం చెబుతోంది. 
గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్‌ టేబుల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం చాలా మంది వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను, రాయబారులను పిలిచింది. ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు ఉన్న అనేక వనరులను, అనుకూల పరిస్థితులను వారికి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. వచ్చిన వారందరితో సీఎం జగన్ సమావశమై.. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు వివరించనున్నారు. 


మార్చి మూడు, నాలుగు తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. విశాఖ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ మీటింగ్‌లో బీటుబీ, బీటూజీ సమావేశాలు, నిర్వహించనున్నారు. మరికొన్ని కీలక సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తున్న సెక్టార్లలో కనిపిస్తున్న అభివృద్ధి. చేపట్టే కార్యక్రమాలను అతిథులకు వివరించనున్నారు. 
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన... పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి అనుభవాలను ఈ వేదికపై నుంచి అతిథిలకు వివరిస్తారు.


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వారి ద్వారానే ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ప్రధాన నగరాల్లో కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు 28 విదేశీ పెట్టుబడులుదారులను, 44 దేశాలకు చెందిన రాయబారులు వస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


ఏపీ అడ్వాంటేజ్‌ అనే థీమ్‌తో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించబోతున్నట్టు ప్రభుత్వం అతిథులకు వివరించనుంది. ఇలాంటి కార్యక్రమాలు అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో కూడా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అక్కడ చిన్న చిన్న సమావేశాలు, రోడ్‌షోలు, చిట్‌చాట్‌లాంటి కార్యక్రమాలతో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ను విజయవంతం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.


 దిల్లీ టూర్ కు ముందు ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయ్యింది. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.


చేదోడు పథకం 


రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ. 330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో  బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.  జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల చొప్పున అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 30,000 ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్ల కాలంలో  ఈ పథకం ద్వారా  ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 927.51 కోట్లు.